అసనీ తుఫాన్ ఎఫెక్ట్ తో శ్రీకాకుళం జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు రథంలాంటిది ఒకటి కొట్టుకు వచ్చింది. ఇది బంగారు వర్ణంతో దగ దగ మెరిసిపోతుంది. దీన్ని చూసేందుకు అక్కడ జనాలు తరలివచ్చారు. ఇలాంటి రథాన్ని తాము ఎప్పుడూ చూడలేదని.. ఇదే మొదటి సారి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు చుట్టుపక్కల ప్రజలు. ఇది ఎక్కడ నుంచి తరలి వచ్చింది..ఇది ఏకాలం నాటిది అని రక రకాల చర్చలు జరుగుతున్నాయి.
ఈ బంగారు రథం పై 16-1-2022 అని ఓ విచిత్రమైన భాషలో రాసి ఉంది. అయితే ఇది ఖచ్చితంగా మలేషియా,థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందిన లిపి అయి ఉండవొచ్చని భావిస్తున్నారు. గతంలో ఇలాంటి తుఫాన్లు వచ్చినపుడు ఎన్నో రకాల వస్తువులు కొట్టుకు వచ్చాయి. కానీ ఎప్పుడూ ఇలాంటి బంగారు వర్ణం ఉన్న రథాన్ని చూడలేదని అంటున్నారు మత్స్యకారులు. ఈ విషయం తెలుసుకున్న మెరైన్ పోలీసులు అక్కడికి చేరుకుని రథాన్ని పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
సముద్ర తీర ప్రాంతంలో కెరటాలు భారీగా ఎగిసి పడుతున్నాయి. కాకినాడ కోనసీమ జిల్లాల తీర ప్రాంతం వెంబడి ఈదురు గాలులు ఘోరంగా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. విశాఖపట్నం తీరాల వెంబడి కదులుతూ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం వుందని తెలుస్తోంది.