బంగారం, ఇతర ఖరీదైన వస్తువులను తరలించేందుకు స్మగ్లర్లు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. మొన్నటి వరకు సముద్ర, విమాన మార్గాల్లో టన్నుల కొలదీ బంగారం తరలి వచ్చేది. వీటిని ప్రయాణీకుల రూపంలో ఉన్న స్మగ్లర్లు పలు రూపాల్లో తీసుకు వచ్చేవారు. వారిని వెతికి పట్టుకోవడంలో కస్టమ్స్ అధికారులకు సవాళ్లు ఎదురయ్యేవి. తాజాగా ఏపీలో భారీ స్మగ్లింగ్ జరుగుతుండగా.. అధికారులు చేధించారు.
బంగారం, వెండి వజ్రాలను స్మగ్లింగ్ చేసేందుకు స్మగ్లర్లు వేర్వేరు మార్గాలను అన్వేషిస్తున్నారు. సముద్ర, విమాన మార్గాల ద్వారా కోట్ల కొలదీ బంగారం ఖండాంతరాలు దాటి వస్తున్నాయి. స్మగ్లర్లను పట్టుకోవడం కస్టమ్స్ అధికారులకు ఓ టాస్క్‌గా మారిపోయింది. మొన్నటి వరకు విమానాశ్రయాల్లో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. చెప్పుల్లో, కాలిలో, తలలో, చివరికీ కడుపులో కూడా బంగారాన్ని మోసుకు వస్తూ అనేక మంది పట్టుబడ్డారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఓ ప్రధాన రైల్వే స్టేషన్‌లో అధికారులు భారీ ఎత్తున బంగారాన్నిసీజ్ చేశారు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాజధానికి కూత వేటు దూరంలో ఉన్న విజయవాడ నడి బొడ్డున భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 12 కిలోలకు పైగా బంగారాన్ని పట్టుకున్నారు. దీని విలువ రూ. 7.48 కోట్లు ఉంటుందని అంచనా . అక్రమంగా బంగారం తరలిస్తున్నారనే ముందస్తు సమాచారం అందుకున్నపోలీసులు రైల్వే స్టేషన్ వద్ద మాటు వేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు కనిపించడంతో్ వారిని సినీ ఫక్కీలో పట్టుకున్నారు. వారి వద్ద నుండి ఐదు కేజీల బంగారాన్ని స్వాధీన పరుచుకుని, విచారించగా.. వారి వద్ద మరింత బంగారం ఉన్నట్లు తేలింది. ఈ బంగారాన్ని ఏపీ నుండి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అయితే నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మరింత బంగారం తరలి వెళుతుందని నిందితులు వెల్లడించారు.
ఆ నిందితులు ఇచ్చిన సమాచారంతో ఆంధ్రా – తమిళనాడు సరిహద్దులో బస్సుల్లో బంగారం తరలిస్తున్న మరో వ్యక్తిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో 7.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ ఆపరేషన్ లో మొత్తం రాష్ట్రంలోని వివిధ కస్టమ్ ఫార్మేషన్‌లకు చెందిన 30 మంది అధికారులు పాల్గొన్నారు. అలాగే రెండు చోట్ల కలిసి మొత్తం నలుగురు నిందితులు అరెస్టయ్యారు. మొత్తం 12.97 కిలోల అక్రమ బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. దొరికిన బంగారం విలువ సుమారు రూ. 7.48 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన బంగారంలో కొంత బిస్కెట్ల రూపంలో ఉండగా, మరికొంత ఆభరణాల రూపాల్లో ఉన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారం పట్టుబడడం ఒక్కసారిగా నగరంలో చర్చనీయాశంమైంది. గతంలో కూడ ఏపీ రాష్ట్రంలో కస్టమ్స్ అధికారులకు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ఘటనలు నమోదయ్యాయి.2014లో విజయవాడలో కస్టమ్స్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత ఇంత మొత్తంలో బంగారం సీజ్ చేయడం ఇదే ప్రథమంగా అధికారులు చెబుతున్నారు.