కాలం అనేది చాలా బలమైనది.. ఎందుకంటే అది ఎప్పుడు ఎవరిని ఏ స్థితిలోకి మారుస్తుందో చెప్పలేము. కోట్లకు అధిపతి అయినవాడు ఒక్కేసారి పాతాళానికి పడిపోతాడు. ఇక మన జీవితం ఇంతే లే.. అని పేదరికంతో బాధపడే వారికి ఉన్నట్టుండి అదృష్ట దేవత తలుపు తడుతుంది. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిన వారు చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తికి పొలంలో మట్టి తవ్వుతుంటే అదృష్ట దేవత పలకరించింది. పురాతన కాలం నాటి నాణేలు ఉన్న కుండ బయటపడింది. దీంతో అనుకోకుండా తలుపు తట్టిన లక్ష్మిదేవిని అక్కున చేర్చుకున్నాడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఏలూరు జిల్లా కొయ్యల గూడెం మండలం ఏడువాడలపాలెంకు చెందిన మానుకొండ తేజస్వీ, సత్యనారాయణ అనే దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఓ పామ్ ఆయిల్ తోట ఉంది. ఆ తోటలో నీటి కోసం పైపులైన్ తవ్వుతుండగా మట్టి కుండ బయటపడింది. చూడటానికి చాలా పురాతనమైనదిగా కనిపించింది. దీంతో ఆ మట్టి కుండను పూర్తిగా తవ్వి..బయటకు తీశారు. అది ఓపెన్ చేసి చూడగా అందులో బంగారు నాణేలు కనిపించాయి. దీంతో ఆ దంపతులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. సత్యనారాయణ ఈ విషయాన్ని స్థానిక ఎమ్మార్వోకు తెలియజేశాడు. దీంతో కుండ దొరికిన ప్రాంతాన్ని తన సిబ్బందితో కలిసి ఎమ్మెర్వో పి.నాగమణి వచ్చారు.
ఎమ్మార్వో నాణేలను, బయటపడిన మట్టి కుండను పరిశీలించారు. పెద్ద సంఖ్యలోనే నాణేలు బయటపడినట్లు, ఒక్కొక్క నాణేం బరువు సుమారు 8 గ్రాములకు పైగా ఉన్నట్లు వారు గుర్తించారు. ఇంకా ఈ మట్టి కుండా రెండో శతాబ్దం నాటిదని వారు భావిస్తున్నారు. గత నెల 29న దొరకగా.. ఆలస్యంగా బయట పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తేజస్వీ పొలంలో బంగారు నాణేలు బయటపడిన విషయం స్థానికంగా సంచలనంగా మారింది. తమ తోటల్లో కూడా ఏమైనా బంగారు నాణేలు దొరుతాయని చుట్టుపక్కల పొలాల వారు భావిస్తున్నారని సమాచారం. వారు కూడా తమ పొలాల్లో నాణేలు కోసం వెతుకుతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.