తెలుగు సినిమాలు అనగానే ముందుగా చెప్పుకొవాల్సింది నందమూరి తారక రామారావు గురించి. సోషల్, హిస్టారికల్, కమర్షియల్ ఇలా అన్ని రకాల సినిమాల్లో నటించి.. మెప్పించారు. మరీ ముఖ్యంగా పలు పౌరాణిక పాత్రలకు తన నటనతో ప్రాణం పోశారు ఎన్టీఆర్. హీరోగా మాత్రమే కాక దర్శకుడిగా, నిర్మాతగా.. రచయితగా సినిమా రంగంపై తనదైన ముద్ర వేశారు. ఆ కాలంలోనే ఆయనకు సొంతంగా సినిమా హాళ్లు కూడా ఉండేవి. వాటిలో ఒకటి.. గుంటూరులోని రామకృష్ణ థియేటర్. ఇక ఈ ఏడాది ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా తెనాలిలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నిర్వాహాకులు తీసుకున్న నిర్ణయం పట్ల సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన నటించిన సినిమాల్లో కొన్నింటిని సెలక్ట్ చేసుకుని.. వాటిని ఏడాది పాటు ఫ్రీగా ప్రదర్శించాలని నిర్ణయించారు. ఇందుకు గాను తెనాలిలోని పెమ్మసాని థియేటర్‌ను ఎంచుకున్నారు. ఈ సందర్భంగా థియేటర్ యజమాని మాట్లాడుతూ..‘‘ఎన్టీఆర్ నటించిన మంచి సినిమాలన్నింటికీ ప్రతి ఆటకు 400 మంది తగ్గకుండా వస్తున్నారు. మా థియేటర్ సామార్థ్యం 470 సీట్లు.. అయితే.. రోజు 300 మందికి పైగా వస్తున్నారు. డ్రైవర్ రాముడు, వేటగాడు.. వంటి సినిమాలు వేసినప్పుడు.. జనాలు భారీగా వచ్చారు.. స్థలం సరిపోక వందల మంది తిరిగి వెళ్లారు. ఏడాది పాటు ఎన్టీఆర్ సినిమాలు ఉచితంగా వేస్తూనే ఉంటాం’’ అని చెప్పుకొచ్చాడు.
అంతేకాక ఎన్టీఆర్ సినిమాలన్నింటిని డిటిజల్ ఫార్మాట్‌లోకి మార్చి ప్రత్యేక ప్రొజెక్టర్ ద్వారా తెరపై ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ఒకే నటుడి సినిమాలను ఏడాది పాటు.. అది కూడా ఉచితంగా ప్రదర్శించడం రికార్డు అంటున్నారు నిర్వాహాకులు. ఈ వార్త విని ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు.. ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.