ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామరావు తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన మహనీయుడు. అంతేకాక ఆయన సినీ, రాజకీయ ప్రస్థానం అందరికి ఆదర్శం. సినీ, రాజకీయ రంగంలో ఆయన ఓ ధృవతార. అయితే అలాంటి మహానీయుడికి సంబంధించి ఓ విషయంలో తెలుగు రాష్ట్రాలో అప్పుడప్పుడు చర్చ వస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ వెన్నుపోటు గురయ్యారని, ఆయనను సొంత వాళ్లే మోసం చేశారని పలువురు విమర్శలు చేస్తుంటారు. ఇదే అంశంలో ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీ మధ్య వాదోపవాదాలు జరుగుతుంటాయి. ఎన్టీఆర్ కు చంద్రబాబు నాయుడే వెన్నుపోటు పొడిచారంటూ వైసీపీ నాయుకులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అలానే ఇటీవలే బాలయ్య అన్ స్టాపబుల్ షోలో సైతం ఈ టాపిక్ మరోసారి వచ్చింది. తాజాగా మాజీ ఉపరాష్టపతి ఎం. వెంకయ్య నాయుడు కూడా ఎన్టీఆర్ విషయంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే ఎన్టీఆర్ వెన్నుపోటుకు గురయ్యారు అంటూ వెంకయ్యనాయుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నటరత్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం తెనాలిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుక జరిగింది. ఈ వేడుకకు భారత దేశ మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ హైకోర్టు జడ్జీ జస్టిస్ రాధరాణి, ఎన్టీఆర్ కుమార్తె లోకేశ్వరి, కుమారుడు రామకృష్ణ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు .. ఎన్టీఆర్ గురించి అనేక విషయాలు తెలియజేశారు.
ఎన్టీఆర్ గొప్పతనాన్ని, ఆయన వ్యక్తిత్వంకు సంబంధించి పలు విషయాలను తెలిపారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. “రాజకీయాల్లోని కుట్రలు, కుతంత్రాలు ఎన్టీఆర్ గమనించలేకపోయారు. రాజకీయాల్లో ఆయన భోళా మనిషి. అందుకే వెన్నుపోటుకు గురయ్యారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో సైలెంట్ విప్లవాన్ని తెచ్చారు. పేదలకు సంక్షేమానికి అనేక పథకాలు తెచ్చారు” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ గురించి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.