మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన్ని కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆదివారం తెల్లవారు జామున ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం వసంత కుమార్ భౌతిక దేహాన్ని విశాఖపట్నం నుంచి స్వగ్రామానికి తీసుకెళుతున్నారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా, వట్టి వసంత కుమార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. వైఎస్సార్, కిరణ్ కుమారెడ్డి, రోశయ్య హయాంలలో మంత్రిగా పని చేశారు.
వైఎస్సార్, రోశయ్య క్యాబినేట్‌లో రూరల్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రిగా.. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినేట్‌లో టూరిజం శాఖ మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలనుంచి దూరంగా వచ్చారు. అనారోగ్య సమస్యల కారణంగా క్రీయా శీలక రాజకీయాలను దూరం పెట్టారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన కాపు సమావేశాల్లో చురుగ్గా పాల్గొనే వారు. ఇక, ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. వట్టి దంపతులకు పిల్లలు లేకపోవటంతో బంధువుల బిడ్డను దత్తత తీసుకున్నారు. 3 ఏళ్ల క్రితం ఆయన భార్య కాలం చేశారు. మరి, వట్టి వసంత కుమార్ మృతిపై మీ సంతాపాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.