ఉమ్మడి ఎపి మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతుహలమ్మ బుధవారం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో తిరుపతిలోని ఆమె నివాసంలో తుది శ్వాస విడిచారు. వృత్తి రీత్యా వైద్యురాలైన కుతుహలమ్మ, రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ లో చేరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ బుధవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపుడుతున్నఆమె బుధవారం తెల్లవారు జామున తిరుపతిలో తన నివాసంలో కన్నుమూశారు. 1949లో ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో జన్మించిన ఆమె.. వైద్య విద్యను అభ్యసించారు. ఆ తర్వాత వైద్య వృత్తిని కొనసాగించిన ఆమె రాజకీయాలపై ఆస్తకితో 1979లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిత్తూరు జడ్పీ చైర్ పర్సన్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1985లో వేంపరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి.. విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1991లో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
1992-93లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1989, 1999, 2004లోనూ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1994లో కాంగ్రెస్ సీటు నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2007 నుంచి 2009 వరకు డిప్యూటీ స్పీకర్ గానూ వ్యవహరించారు. అయితే, 2009లో వేపంజేరి నియోజకవర్గం రద్దు కాగా, ఎస్సీ రిజర్వుడు స్థానం గంగాధర నెల్లూరు నుంచి కుతూహలమ్మ పోటీ చేయాల్సి వచ్చింది. ఎక్కువ కాలం కాంగ్రెస్ లో పనిచేసిన ఆమె.. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో టీడీపీలోకి చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు. ఏడాదిన్నర క్రితం తన కుమారుడితో కలిసి టీడీపీకి రాజీనామా చేశారు.