ఏపీలో మరో 13 కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలను తెలియజేయాల్సిందిగా ప్రజలను కోరింది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. నూతన జిల్లాల ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. బుధవారం వర్చువల్‌గా సమావేశమైన ఏపీ కేబినెట్.. రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 26 జిల్లాలతో పాటు 70 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ఏప్రిల్ 4న ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.
కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్జీఆర్ విజయవాడ జిల్లాలు అమలులోకి రానున్నాయి.పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, శ్రీకాళహస్తి, నగరి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. అలానే ఏప్రిల్ 6న వాలంటీర్ల సేవలకు సత్కారం జరపనుంది. ఏప్రిల్ 8న వసతి దీవెన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.