అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ భారీ అగ్నిప్రమాదంలో నలుగురు సజీవదహనం కాగా.. మరో వ్యక్తి ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఫార్మాసిటీలోని లారస్ ల్యాబ్స్ అనే కంపెనీలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని అండర్ గ్రౌండ్ లో ఉన్న మ్యానుఫాక్టరింగ్ యూనిట్-6లో సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. డ్రయర్లు- రియాక్టర్ వద్ద ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వాటిని అదుపుచేసే సమయం కూడా లేకపోయింది. ఆ మంటల తీవ్రతకు అక్కడున్న రబ్బరు వస్తువులు మొత్తం కాలిపోయాయి. మంటల తీవ్రత తగ్గిన తర్వాతే ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
గాయాలతో కొట్టుమిట్టాడుతున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన యడ్ల సతీష్ ను సాయంత్రం 4.30 గంటల సమయంలో వైజాగ్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు.. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలానికి చెందిన రాపేటి రామకృష్ణ(28), గుంటూరుకు చెందిన తలశిల రాజేశ్ బాబు(36), తెలంగాణ ఖమ్మం జిల్లాకు చెందిన బంగి రాంబాబు(32), చోడవరం మండలం బెన్నవోలుకు చెందిన మజ్జి వెంకటరావు(36)గా గుర్తించారు. ఈ ప్రమాదానికి కారణం సాల్వెంట్ లీకవడమే అని సమాచారం. ఈ సాల్వెంట్ లీకవడాన్ని గుర్తించిన ఉద్యోగులు దానిని అదుపుచేసేందుకు పరిశీలిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంపై మొదట ఎవరికీ సమాచారం అందలేదు. దానికి కారణం.. భారీ షెడ్ అనేది అండర్ గ్రౌండ్ లో ఉండటం వల్ల కొద్దిపాటి పొగ తప్ప ప్రమాదతీవ్రత బయటకు కనిపించలేదు. మరోకటి ఉద్యోగులు అంతా వారి సెల్ ఫోన్లను గేటు వద్దే వదిలి వెళ్లడం కూడా సమాచారం లేకపోవడానకిి కారణంగా చెప్పవచ్చు. రాత్రి 7 గంటల వరకు అసలు ప్రమాదం, దాని తీవ్రతపై సరైన సమాచారం అందలేదు. 4.30 గంటలకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా.. అప్పటికే బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేయిస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.
ఈ ఘటనపై పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ స్పందించారు. సీఎం ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. గాయాలైన బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మొదట క్షతగాత్రుడితో పాటుగా మృతులు నలుగురిని కూడా ఆస్పత్రికి తరలించారు. ఇంకా ప్రాణాలు ఉన్నాయేమో అని ఆఖరి ప్రయత్నం చేయగా.. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నాలుగు మృతదేహాలను కేజీహెచ్ కు తరలించారు.