ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతుందని అధికారులు అంటున్నారు.
గత వారం రోజుల నుంచి ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. గత నెల వర్షాలు పడి వాతావరణం చల్లగా మారిందని అనుకునేలోపు భానుడు ప్రతాపం చూపించడం మొదలు పెట్టాడు. ఎండ ప్రభావంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారు. పశువులు, పక్షులు అల్లాడిపోతున్నాయి.. మరో వారం పాటు ఇలాగే వేడి వాతావరణం ఉంటుందని, అధిక ఉష్ణోగ్రత పెరిగిపోతుందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఎండాకాలం అటవీ ప్రాంతాల్లో మంటలు రాజుకోవడం సహజం. కొన్నిసార్లు మానవ తప్పిదాల వల్ల కూడా మంటలు చెలరేగుతుంటాయి. తాజాగా తిరుపతి జిల్లా శ్రీకాళ హస్తి ఆలయ సమీపంలో అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. వివరాల్లోకి వెళితే..
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయానికి సమీపంలో కైలాసగిరి లో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగాయి. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అగ్గి పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి ఎండిపోయిన వృక్ష సంపద కాలి బూడిదైంది. మంటలను అదుపు చేసేందుకు ఆలయ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి ప్రయత్నించగా.. అప్పటికే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం అందించారు. ఆలయానికి సమీపంలో గోశాల ఉందని.. అందులో 700 వరకు గోవులు ఉన్నాయని అధికారులు అంటున్నారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.