అంబేడ్కర్ కోనసీమ జిల్లా గొల్లవిల్లిలోని ప్రైవేటు పాఠాశాలలో ప్రమాదం సంభవించింది. ప్రైవేటు స్కూలు నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సంక్రాంతి సంబరాలు పేరిట గొల్లవిల్లి విజ్ డమ్ పాఠశాలలో భోగి మంటలు వేశారు. ఆ మంటలు ఒక్కసారిగా ఎగిసిపడి పక్కనే ఉన్న ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన అమలాపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మండుతూ ఉన్న మంటలపై పెట్రోలు పోయడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నట్లు చెబుతున్నారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారంతా బోరున విలపిస్తూ ఆస్పత్రికి చేరుకున్నారు.
పిల్లల పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. స్వల్ప గాయాలే అయ్యాయని, ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయాలైన పిల్లలు వనీషా మూడో తరగతి, మధుర కీర్తన మూడో తరగతి, శామ్యూల్ స్టీఫెన్ యూకేజీ చదువుతున్నట్లు గుర్తించారు. మంత్రి పినిపే విశ్వరూప్, అధికారులు ఆస్పత్రికి చేరుకుని గాయాలపాలైన విద్యార్థులను పరామర్శించారు. అధికారులతో కలిసి ఆస్పత్రికి వెళ్లిన మంత్రి.. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం మెరుగ్గానే ఉందని చెప్పారు. తల్లిదండ్రులకు భయపడొద్దని ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.