అన్ని బంధాల్లోకెల్లా రుణానుబంధం గొప్పదని పెద్దలు చెబుతుంటారు. రక్తం పంచుకొని పుడతారు కాబట్టి ఈ బంధాన్ని మించినది మరొకటి లేదని అంటుంటారు. అయితే తల్లిదండ్రుల రుణం అంత తేలిగ్గా తీర్చలేనిది. మనకు జన్మను ఇవ్వడమే కాదు.. విద్యాబుద్ధులు నేర్పించి పెద్దలను చేస్తారు. కెరీర్‌లో ఎంత ఎదిగినా, పెళ్లై పిల్లలు పుట్టినా.. తల్లిదండ్రులకు వాళ్లెప్పుడూ చిన్న పిల్లలనే చెప్పాలి. పేరెంట్స్ తమ పిల్లల్ని ఎప్పుడూ అలాగే చూస్తారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి తమ రెక్కాడే వరకు వారి కోసం ఏదైనా చేస్తారు, ఎంతైనా శ్రమిస్తారు. వాళ్ల కోసమే సంపాదిస్తారు. కొందరైతే పస్తులుండి తమ పిల్లల పొట్ట నింపుతారు. అందుకే తల్లిదండ్రుల ప్రేమకు ఏదీ సాటి రాదని చెబుతుంటారు. అలాంటి తల్లిదండ్రులు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అది అనుభవించిన వారికే తెలుస్తుంది.
అల్లారుముద్దుగా పెంచి, తమ జీవితాలను తీర్చిదిద్దిన తల్లిదండ్రులు ఇక లేరనే బాధను దిగమింగడం కష్టమే. పేరెంట్స్‌లో ఎవరు చనిపోయినా వారి అంత్యక్రియలు మగ పిల్లలే చేస్తారు. అయితే మగ సంతానం లేకపోతే బంధువుల్లో ఎవరితోనైనా చేయిస్తారు. కానీ ఒక చోట తండ్రి చనిపోతే ఆయనకు కూతురే కొరివి పెట్టింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చినగంజాం మండలం, సోపిరాల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన తుమ్మలపెంట వెంకటరావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో వెంకటరావు పెద్ద కుమార్తె అంజలి కన్నతండ్రికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి అంతిమయాత్రలో ముందు నడవడమే కాకుండా ఆయన చితికి కొరివి కూడా పెట్టి రుణం తీర్చుకున్నారు అంజలి.