ఒక మామిడికాయ ఉచితంగా ఇవ్వమంటేనే ఏ షాపు వాడు ఇవ్వడు. అలాంటిది ట్రాక్టర్ లోడ్ మామిడికాయలను ఒక రైతు ఉచితంగా పంచి పెట్టారు. అలా అని అతనేమీ అంబానీ రేంజ్ ఆస్తిపరుడు కాదు. స్వార్థపూరిత సమాజం చేతిలో నలిగిపోతున్న ఒక పేద రైతు.
దేశానికి వెన్నెముక రైతు అని అంటారు. రైతే రారాజు అని అంటారు. అనడమే గానీ నిజం చేయరు ఎవరూ కూడా. రైతు ఎలా పోతే మనకేంటి అన్నట్టే ఉంటున్నారు. రైతుకు, ప్రజలకు మధ్య దళారి అనే వ్యక్తి ఉంటాడు. ఈ దళారి ఎంత రేటు చెప్తే అంత. ఈ దేశంలో ఎవరు తయారు చేసిన వస్తువుకు ధరను నిర్ణయించుకునే హక్కు అందరికీ ఉంది. ఒక్క రైతుకు తప్ప. కరెంటు పని చేసుకునే వ్యక్తికి తన కూలీ ఇంత అని నిర్ణయించుకునే హక్కు ఉంది. టీవీలు, ఏసీలు తయారు చేసే కంపెనీకి తన ఉత్పత్తుల ధరలను నిర్ణయించే హక్కు ఉంది. కానీ మన కడుపు నింపే రైతు తాను పండించిన పంటకు ధరలు నిర్ణయించే హక్కు లేదు. ఇది రైతు ఓటమి కాదు, రైతు మనసును అర్థం చేసుకోలేని మనందరి ఓటమి. రేపన్న రోజున రైతనే వాడే లేకపోతే మట్టి తిని బతకాలి.
రైతు కష్టాన్ని అర్థం చేసుకునే మనుషులే లేరు. దళారులు గిట్టుబాటు ధర ఇవ్వరు. ఇవ్వకపోగా రైతు నష్టపోయే విధంగా తక్కువ ధరకు అడుగుతారు. రైతు చేసేదేమీ లేక నెలల పాటు పండించిన పంటను నష్టానికి అమ్ముకుంటాడు. పెట్టిన పెట్టుబడి రాదు, అదనంగా రవాణా ఛార్జీలు.. ఈ రైతు బతుకే ఒక దరిద్రం అనుకునే పరిస్థితికి తీసుకొచ్చేశారు. ఏలూరు జిల్లాకి చెందిన ఓ రైతు ట్రాక్టర్ మామిడి కాయలను ఉచితంగా పంచారు. ఆగిరిపల్లి మండలం కొత్త ఈదర గ్రామానికి చెందిన బెక్కం రాజగోపాల్ అనే రైతు.. నూజివీడులోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వరకూ ట్రాక్టర్ మామిడికాయలను ఉచితంగా పంపిణీ చేస్తూ వినూత్న నిరసన తెలియజేశారు.
దళారీల వల్ల పంట పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదనతో ట్రాక్టర్ లోడు మామిడికాయలను నూజివీడు తీసుకొచ్చి ఉచితంగా పంచిపెట్టారు. అకాల వర్షాల కారణంగా మామిడి తోటలో మంగు, మసి వచ్చి మామిడికాయలు పాడైపోతున్నాయని.. దీన్ని అదునుగా చేసుకుని దళారీలు తక్కువ రేటుకి అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి మార్కెట్ కి తీసుకెళ్లినా కొనే నాథుడు కనిపించడం లేదని.. అందుకే ప్రజలకు ఉచితంగా పంచిపెడుతున్నట్లు రాజగోపాల్ అనే రైతు తన బాధను వెళ్లగక్కుకున్నారు. అయితే ఇక్కడ ఉచితంగా ఇస్తున్నాడని ఎగేసుకుంటూ వచ్చారు జనాలు. ఉచితంగా ఏమీ వద్దు, డబ్బులు తీసుకో అని ఒక్కరు కూడా అనలేదు. ఒక్కరు కూడా రైతు గోడును అర్థం చేసుకోలేదు.
అదే మామిడికాయలు డబ్బులకు అమ్మితే మంగు ఉంది, మసి ఉంది అని సాకు చెప్పి పోతారు. ఉచితంగా అనేసరికి మంగు లేదు, మసి లేదు. ఏం మనుషులో. కనీసం ఉచితంగా తీసుకున్నందుకైనా కృతజ్ఞతగా రైతుతో కలిసి కాసేపు నిరసన వ్యక్తం చేశారా? అసలు రైతు పంట పండించేదే ప్రజల కోసం. దళారీ కొనకపోతే ఏం, ప్రజలు కొనలేరా? మేమున్నాం మీకు అని ప్రజలంతా ఒకటి అయిన రోజున రైతుల ఆత్మహత్యలు ఉంటాయా? ఉచితాలకు అలవాటు పడ్డ బతుకులు కదా.. రైతుల కష్టం విలువ ఏం తెలుస్తుందిలే. రైతు రోడ్డు మీదకొచ్చి పంట కొనుక్కోండి బాబు అని అడుక్కోవాల్సిన పరిస్థితికి కారణం ఎవరు? దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
ఒక్కరు కూడా రైతు గోడును అర్థం చేసుకోలేదు.