సాహితీవేత్త, రైటర్, అవధాని డాక్టర్ ఆశావాది ప్రకాశరావు కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. అనంతపురం జిల్లా పెనుకొండలోని స్వగృహంలో నిన్న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శింగనమల మండలం కొరివిపల్లి గ్రామంలో 1944 ఆగస్టు 2న జన్మించారు. సాహితీవేత్తగా, అవధానిగా కీర్తి గడించిన ప్రకాశరావు… తన 52ఏళ్ల సాహితీ జీవితంలో 50కి పైగా పుస్తకాలు రచించారు. 170కి పైగా అష్టావధానాలు నిర్వహించారు. ఎందరో యువ కవులు, అవధానులను ప్రోత్సహించారు.
ఇది చదవండి: చావును చూసొచ్చా: సీనియర్ నటి కృష్ణవేణి
ప్రకాశరావు సేవలకు మెచ్చి అనేక సంస్థలు బిరుదులు, పురస్కారాలతో సత్కరించాయి. ప్రకాశరావు సాహితీ సేవలకు గాను భారత ప్రభుత్వం 2021లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించి గౌరవించింది. రాష్ట్ర ప్రభుత్వం కళారత్న బిరుదుతో సత్కరించింది. ఇక ప్రకాశరావు తన కళ్లను ఇప్పటికే దాన చేశారు. దీంతో సాయిట్రస్టు నేతృత్వంలోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి డాక్టర్లు.. ఆయన కళ్లను సేకరించి హైదరాబాద్‌కు తరలించారు. ప్రకాశరావు మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రకాశరావు మెరుపుతీగలు, పుష్పాంజలి, విద్యా విభూషణ, అంతరంగ తరంగాలు, చెల్లపిళ్లరాయ చరిత్రము, శ్రీ రాప్తాటి పరిచయ పారిజాతము, ఆర్కెస్ట్రా (వచన కవిత), ఘోషయాత్ర నాటకం, నారాయణ శతకము, సహయాచారి సాహితీ సాహచర్యము వంటి రచనలు చేశారు. ప్రకాశరావు 40కిపైగా పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. ప్రకాశరావు మృతి పట్ల పలువురు సాహితీ ప్రముఖులు, కళాకారులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.