విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. ప్రజల్లోనే కాక రాజకీయ వర్గాల్లో కూడా హీట్ పెంచింది. ఇక తాజాగా ఈ వ్యవహారంలోకి తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీ ఇవ్వడంతో.. పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బర్నింగ్ టాపిక్‌గా నిలిచింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తామంటూ.. కొన్నాళ్ల క్రితమే కేంద్రం ప్రకటించింది. ఇక తాజాగా ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీ ఇవ్వడంతో.. ఈ అంశం రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్.. సింగరేణి సంస్థ ద్వారా.. విశాఖ ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడమే కాక.. ఏప్రిల్ 15 వరకు బిడ్ దాఖలు చేస్తారంటూ జోరుగా వార్తలు వచ్చాయి. దీనికి బలం చేకూరుస్తూ.. సింగరణి సంస్థ నుంచి ముగ్గరు డైరెక్టర్లు వెళ్లి స్టీల్ ప్లాంట్ వివరాలను అధ్యయనం చేశారు. ఇక కేసీఆర్ ప్రభుత్వం ముందు నుంచి కూడా విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక తాజాగా విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ప్లాంట్ ప్రైవేటీకరణ కన్నా ముందు ఆర్‌ఎన్‌ఐఎల్‌ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని తెలిపారు. పూర్తిస్థాయి సామర్ధ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని.. వీటిపై ఆర్‌ఎన్‌ఐఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్‌లో పాల్గొనడం ఒక ఎత్తుగడ మాత్రమే అన్నారు. గత కొన్ని రోజులుగా రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణపై ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయడానికి రెడీ అయ్యింది. దీనిలో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో భాగస్వామిగా చేరేందుకు ఉక్కు, ముడి ఉక్కు తయారీపై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి వ్యాపార ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ యాజమాన్యం మార్చి 27న ఒక ప్రకటన విడుదల చేసింది. బొగ్గు, నేల బొగ్గు, ఇనుము వంటి ముడి పదార్థాలను సరఫరా చేయడంతో పాటు నిబంధనల మేరకు పరస్పర అంగీకారంతో ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్‌లో పేర్కొంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలను ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 3 గంటల్లోగా సమర్పించాలని యాజమాన్యం సూచించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ స్టీల్ ప్లాంట్ బిడ్డింగులో పాల్గొనేందుకు ఆసక్తి చూపారు. ఇది రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఇక తాజాగా కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో.. ఈ వ్యవహారానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లే అంటున్నారు. మరి తాజా పరిణామంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.