ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి కొడాలి నాని అంటే తెలియని వారు ఉండరు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులపై తనదైన మాటల తూటాలు పేలుస్తుంటారు. ఇక ఆయన ఆహార్యం విషయానికి వస్తే.. ఎప్పుడు గెడ్డం, మీసం.. మెడలో రుద్రాక్ష మాలలు, చేతికి ఉంగరాలతో కనిపిస్తుంటారు. అలాంటి కొడాలి నాని కొత్త అవతారం ఎత్తారు. వివరాల్లోకి వెళితే..
ఈ మద్య జరిగిన వైసీపీ ప్లీనరీలో హడలెత్తించిన కొడాలి నాని లుక్కే మారిపోయింది. మంగళవారం తిరుమలశ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తన గడ్డం, మీసం, తలనీలాలు శ్రీవారికి సమర్పించారు. ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో కొడాలి నాని స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజలు, సీఎం జగన్ కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని.. వైసీపీ ప్రభుత్వం బాగుండాలని ఆ దేవ దేవుడైన శ్రీనివాసుడిని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు. ఇక పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లు.. ప్రతిపక్షం, కొన్ని మీడియా సంస్థలు వైయస్ జగన్ ప్రభుత్వం పై విషం చిమ్ముతున్నాయని అన్నారు.
ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా.. ఆ దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటాయని సీఎం జగన్ భావిస్తున్నారని.. ప్రజలకు మేలు చేయాలని తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. జగన్‌ను భ్రష్టు పట్టించాలనేనుకునే వారిని ఆ దేవుడే శిక్షిస్తాడు అని అన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: వరదలపై CM జగన్ సమీక్ష. ఒక్కొక్కరి చేతికి రూ.2వేలు!