ఏపీ పదోతరగతి ఫలితాలు రానే వచ్చాయి. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. నంద్యాల జిల్లా అత్యల్ప ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. 38 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు.
ఏపీ పదో తరగతి ఫలితాలు రానే వచ్చాయి. ఈ ఫలితాల్లో 72.26 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో పాసయ్యారు. ఈ ఏడాది కూడా పదో తరగతి ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బాలురు 69.27 శాతం(2,14,220) ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 75.38 శాతం(2,22,976) మంది పాసయ్యారు. జిల్లాల వారీగా చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానం(87.47 శాతం)లో నిలిచింది. నంద్యాల జిల్లా చివరి స్థానం(60.39 శాతం) దక్కించుకుంది. వీరిలో ఇప్పుడు ఒక అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కూలీ కుమార్తె రూ.590 మార్కులతో సత్తా చాటింది.
పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లా పెదపాడు మండలం పేరు బాగా వినిపిస్తోంది. ఎందుకంటే వట్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో చదివిన పసుపులేటి గాయత్రికి పదో తరగతి ఫలితాల్లో 590 మార్కులు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిగా గాయత్రి అద్భుతమైన మార్కులు సాధించింది. ఆమె తండ్రి రమేశ్ కూడా గాయత్రి ప్రతిభ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెకు పదో తరగతి ఫలితాల్లో 590 మార్కులు రావడం ఎంతో సంతోషంగా ఉందంటూ తెలియజేశారు. గాయత్రికి 590 మార్కులు రావడం పట్ల స్కూల్ టీచర్లు మాత్రమే కాదు.. గ్రామస్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఓవరాల్ గా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 53.99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఏపీ గురుకుల పాఠశాలల్లో 95.25 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం 933 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మరోవైపు 38 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ప్రైవేటు పాఠశాలల్లో 22, ఎయిడెడ్ లో 7, ఆశ్రమ పాఠశాలల్లో 3, ప్రభుత్వ, జడ్పీల్లో 6 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాకపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. జూన్ 2 నుంచి 10 వరకు అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన పసుపులేటి గాయత్రికి కామెంట్స్ రూపంలో మీ అభినందనలు తెలియజేయండి.