ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు నియమించిన వాలంటీర్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఆదేశాలు ఏంటంటే..!
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ వాలంటీర్ల పాత్ర మీద విమర్శలు వస్తున్నాయి. ఎలక్షన్ల సమయంలో తమకు అనుకూలంగా వ్యవహరించలేదని పలువురు వాలంటీర్లను తొలగించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో మరోసారి వాలంటీర్ల పనితీరు మీద విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో వైసీపీ సర్కారు హయాంలో నియమించిన దాదాపు మూడు లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది.
గతంలో కూడా వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం పదే పదే ఆదేశాలు జారీ చేశాయి. అయినా క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయాల్సిన కలెక్టర్లు, డీపీవోలు, ఇతర ఆఫీసర్స్ మాత్రం వాలంటీర్లను కట్టడి చేసే విషయంలో దూకుడు ప్రదర్శించలేదు. దీంతో ఇప్పుడు వాలంటీర్లను కట్టడి చేయాలంటూ మళ్లీ ఎన్నికల సంఘానికి కంప్లయింట్లు అందుతున్నాయి. వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం మరోమారు స్పందించింది. వాలంటీర్లను కట్టడి చేయాలంటూ ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు సీఈసీ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయన జిల్లా కలెక్టర్లకు మరోమారు లేఖలు రాశారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరారు. ఈసారైనా ఈసీ ఆదేశాలను కలెక్టర్లు పాటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.