ఏపీలోని ప్రముఖ ఆస్పత్రులే లక్ష్యంగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అటు ఒడిశాలో కూడా ఆస్పత్రులపై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏపీలో మంగళగిరి NRI, విజయవాడ అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో మహిళల కోసం ప్రత్యేక ఆస్పత్రి అంటూ అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్‌ని ప్రారంభించారు. గతంలో NRI ఆస్పత్రి డైరెక్టర్‌గా ఉన్న అక్కినేని మణి తర్వాత ఈ అక్కినేని ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ ఆస్పత్రి ప్రారంభించేందుకు నిధులు ఎలా వచ్చాయి? ఎవరైనా దీనికోసం ఫండింగ్ చేశారా? వంటి కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మంగళగిరి NRI ఆస్పత్రి నిధులను అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రికి దారి మళ్లించినట్లు అక్కినేని మణి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రెండు ఆస్పత్రుల్లో సిబ్బంది మొక్క ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్పత్రుల రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎన్నారై ఆస్పత్రికి సంబంధించి ట్రస్టు సభ్యుల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ట్రస్టు సభ్యులు ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించారు. ఎన్నారై పాత మేనేజ్మెంట్ డైరెక్టర్ల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిధులు దారి మళ్లింపు, కొత్త ఆస్పత్రికి నిధులు ఎలా సమీకరించారు? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.