మాటలకందని విషాద వార్త ఇది. కరెంట్ షాక్ తో రెండు కాళ్లు కోల్పోయి చిన్నారి దర్శిత్(3) చివరకి మృత్యుఒడికి చేరాడు. బుడి.. బుడి మాటలతో.. ఆడుకోవాల్సిన వయసులో తనువు చాలించడం అందరిని కంటతడి పెట్టిస్తోంది. తల్లితో పాటు బిల్డింగ్ పైకెళ్లిన పిల్లాడు.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనంతలోకాలకు చేరాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలం పైడిమెట్టకు చెందిన చాందిని అనే మహిళ ఈనెల 12న తన ఇంటి మేడపై దుస్తులు ఆరేయడానికి వెళ్ళింది. తనతోపాటు తన మూ డేళ్ల కొడుకు దర్శిత్‌ను కూడా వెంటబెట్టుకువెళ్లారు.
ఈ క్రమంలో తల్లి బట్టలు ఆరేస్తూ తన పనిలో ఉండగా, దర్శిత్ ఆడుకుంటూ పక్కనే వేలాడుతున్న 33కేవీ విద్యుత్ వైర్లకు సమీపంగా వెళ్ళాడు. అంతే.. ఒక్కసారిగా షాక్ తగిలి కింద పడిపోయాడు. వెంటనే తల్లిదండ్రులు దర్శిత్‌ను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా కాకినాడ జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. అక్కడ దర్శిత్‌ను పరిక్షించిన వైద్యులు అప్పటికే శరీరంలో ఇన్‌ఫెక్షన్ పెరిగినట్లు గుర్తించారు. బాలుడి రెండు కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయినట్లు నిర్ధారించారు. దీంతో ఐదు రోజుల కిందట రెండుకాళ్లు మోకాళ్ల వరకు తీసేశారు. అయినప్పటికీ ఇన్ఫెక్షన్ తగ్గకపోవడంతో కుడికాలులో శుక్రవారం మోకాలు పైభాగం వరకు తొలగించారు. ఆ తర్వాత పిల్లాడిని వార్డుకు తీసుకొచ్చిన కొద్దిసేపటికే గుండె కొట్టుకోవడం నెమ్మదించి మృతిచెందాడు.
14రోజులు మృత్యువులో పోరాడి బాలుడు తనువు చాలించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. దర్శిత్ రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. కుమారుడి చికిత్స కోసం ఆతల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను సామాజికమాధ్యమాల ద్వారా తెలుసుకున్న పలువురు దాతలు చేతనైనంత సహాయం చేశారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలతో అయిన చూసుకోవచ్చు అనుకున్న ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలింది.