ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో వచ్చిన భూకంప ప్రళయం మిగిల్చిన బాధ నుంచి కోలుకోక ముందే పలు దేశాల్లో వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఇటీవల దేశంలో పలు చోట్ల భూకంపాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, హర్యాన, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖాండ్, రాజస్థాన్ తోపాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుడప్పుడు భూకంపాలు సంభవిస్తున్నాయి. గత నెలలోని ఏపీలో పలు జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలో భూ ప్రకంపనలు రాడంతో జిల్లా వాసులు భయంతో వణికిపోయారు. తాజాగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడంతో జనాలు భయంతో ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా దొరవారిసత్రంతో పాటుగా చుట్టు పక్కల కొన్ని గ్రామాల్లో భూమి హఠాత్తుగా కంపించండంతో ఇంట్లో ఉన్న సామాన్లు కిందపడిపోవడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. దీంతో ఇళ్లల్లో నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు జనం. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై ఎంత నమోదు అయ్యిందన్న విషయం ఇంకా తెలియరాలేదు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో భూకంపం ప్రళయం సృష్టించింది.. అప్పటి నుంచి భూకంపం పేరు వింటేనే వెన్నుల్లో వణుకు పుడుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.