దేశం అంతా కరోనా ఉదృతి కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో మిగతా రాష్ట్రాలలో రాజకీయాలకి ఛాన్స్ లేకుండా పోయింది. అధికార, ప్రతిపక్షాలు కలసి ప్రజల బాగోగులపై ద్రుష్టి పెడుతున్నాయి. కానీ.., రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ఒకవైపు తెలంగాణలో ఈటల చాప్టర్ హీట్ పుట్టిస్తోంది. ఇక ఏపీలో అయితే ఇలాంటి పొలిటికల్ ఇష్యూస్ కి కొదవే లేదు. నిన్న మొన్నటి వరకు రఘురామ అరెస్ట్ పొలిటికల్ గా పెద్ద చర్చకి కారణం అయ్యింది. ఇక ఇప్పుడు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ కూడా హీట్ పెంచుతోంది. ఇలాంటి అంశాలన్నీ పక్కన పెడితే.., ఇప్పుడు ఏపీలో చోటు చేసుకున్న మరో అంశం అధికార పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో రాష్ట్రంలో రంగుల రాజకీయం నడిచిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాల నుండి సర్కారీ దావఖానాల వరకు.., ప్రభుత్వ స్కూల్స్ నుండి దేవాలయాల గోడల వరకు అప్పట్లో వైసీపీ జెండా రంగులతో నిండిపోయాయి. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు సీరియస్ గా తీసుకున్నాయి. కోర్టులో కేసులు వేశాయి. దీంతో.., ప్రభుత్వ కార్యాలయాలకి రాజకీయపార్టీల రంగులు ఉండటానికి వీలు లేదని అప్పట్లో న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అక్కడితో రంగుల రాజకీయానికి తెర పడినట్టు అయ్యింది.
కానీ.., మళ్ళీ ఇలాంటి ఘటనే ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆలయంలో రిపీట్ అయ్యింది. ఇప్పుడు ఆ ఆలయ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 22 నుంచి 29 వరకు వైశాఖమాస తిరు కల్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి. అయితే శనివారం బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు కావడంతో రాత్రి స్వామి వారి పవళింపు సేవ నిర్వహించారు. అయితే ఈ వేడుకకు సంబంధించి గర్భాలయంలో పూలు, పళ్లతో అలంకరణ చేశారు. ఈ అలంకరణలో వైసీపీ రంగులతో కూడిన ప్లాస్టిక్ పూల దండలను వినియోగించడం వివాదాస్పదంగా మారింది. గర్భాలయంతో పాటు ఆలయ ముఖద్వారాలకు గజ మాలలుగా వైసీపీ జెండా రంగుల ప్లాస్టిక్ పూలను వేలాడదీశారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి ప్రత్యక్షంగా పాల్గొన్న ఉత్సవాల్లో.. ఇలా జరగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈవోతో పాటు అధికారుల వైసీపీ పైత్యంపై భక్తులు మండిపడుతున్నారు. మరి.., ఈ విషయంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.