దువ్వాడ రైల్వే స్టేషన్ ఘటనలో రైలు, ప్లాట్ ఫాం మద్య నలిగిన యువతి శశికళ కన్నుమూసింది. రెండిటి మధ్య నలిగి తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించారు. పక్కటెముకలు బాగా విరిగిపోవటంతో వైద్యులు ఆమెకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే, లోపలి భాగాలు బాగా దెబ్బతినటంతో శశికళ ఆరోగ్యం విషమించింది. గురువారం ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచింది. కాగా, అన్నవరానికి చెందిన శశికళ దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది. బుధవారం గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ రైలు దువ్వాడ బయలుదేరింది. స్టేషన్‌కు చేరుకున్నాక రన్నింగ్ ట్రైన్‌లోంచి కిందుకు దూకింది. అయితే, ప్రమాదవశాత్తు ఆమె రైలు, ప్లాట్ ఫాం మధ్యలో పడిపోయింది. మెల్లగా వెళుతున్న రైలు ఆమెను ముందుకు లాక్కుపోయింది.
కొద్ది సేపటి తర్వాత రైలు ఆగింది. కానీ, శశికళ మాత్రం రెండిటి మధ్యలోనే ఇరుక్కుపోయింది. సహాయం కోసం ఎంతో ప్రార్థించింది. గంటల తరబడి నరకం అనుభవించింది. అక్కడి వారు ఆమెను బయటకు లాగటానికి ఎంత ప్రయత్నించినా వల్ల కాలేదు. తర్వాత రైల్వే రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. రైల్వే రెస్క్యూ టీమ్ సిబ్బంది ప్లాట్ ఫాంను బద్ధలు కొట్టి ఆమెను బయటకు తీశారు. అయితే, అప్పటికే ఆమె పక్కటెముకలు చాలా విరిగిపోయాయి. అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక, యువతి ప్లాట్ ఫాం, రైలుకు మధ్య ఇరుక్కుపోయిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన వారందరూ యువతి పడ్డ నరకాన్ని చూసి చలించిపోయారు.