కాకినాడ జిల్లా అన్నవరం ప్రాంతంలోని దువ్వాడ రైల్వే స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో ఎంసీఏ చదువుతున్న శశికళ అనే విద్యార్ధిని మరణించిన సంగతి తెలిసిందే. దాదాపు 30 గంటల పాటు ఆ యువతి మృత్యువుతో పోరాడి ఓడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. శశికళ మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శశికళ మృతితో ఆమె తల్లిదండ్రులను కన్నీటి రోదలను ఆపడం ఎవరి తరం కాలేదు. ఎన్నో నోముల ఫలంగా పుట్టిన బిడ్డ ఇలా అర్థాంతరంగా తమను వదిలి వెళ్లిపోవటంతో ఆ తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. శుక్రవారం అన్నవరంలో బంధువులు, స్నేహితుల అశృనయనాల మధ్య శశికళ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
శశికళ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఆమె తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడి వారి హృదయాలను ద్రవింపజేసింది. తమ గారాలపట్టి ఇకలేదనే నిజాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేపోతున్నారు. “మమల్ని వదలి వెళ్లిపోయావా శశి ” అంటూ గుండెలు పగిలేలా శశికళ తల్లిదండ్రులు రోదించారు. ఇలాంటి కడుపుకోత.. ఎవరికీ కలగకూడదని చూసినవారంతా బరువెక్కిన హృదాయలతో దేవుడ్ని వేడుకున్నారు. “నిన్ను మరువలేము.. నీ చిరునవ్వు, నీ పలకరింపు.. చిరస్థాయిగా మా హృదాయాల్లో నిలిచిపోతాయి శశి” అంటూ ఆమె బంధుమిత్రులు, స్నేహితులు కన్నీటి పర్యతంతో ఆమెకు చివరి వీడ్కొలు పలికారు. శుక్రవారం జనసందోహం మధ్య శశికళ దహన సంస్కారాలు పూర్తయ్యాయి. శశికళ మృతి చెందడాన్ని ఆమె స్నేహితులు జీర్ణించుకోలేపోతున్నారు. రైలెక్కడానికి స్టేషన్ వెళ్తుంటే.. ఆ దుర్ఘటనే గుర్తొస్తోందని ఆమె స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు.
అన్నవరానికి చెందిన బాబూరావు, వెంకట లక్ష్మి దంపతుల ఒక్కగానొక్క కూతురు శశికళ. పెళ్లయిన ఆరేళ్లకు పుట్టిన బిడ్డ కావడంతో ఎంతో అపురూపంగా చూసుకుంటూ వస్తున్నారు. అడిగింది లేదనకుండా.. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. శశికళ ఉన్నత చదువులు చదివి ఓ గొప్ప స్థానానికి ఎదిగితే చూసి మురిసి పోవాలనుకున్నారు. కూతురి మీదే పంచ ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. శశికళ కూడా తల్లిదండ్రుల ప్రేమను, ఆప్యాయతను ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. తల్లిదండ్రులకు ఎంతో గౌరవం ఇచ్చేది. అలా పెరుగుతు పెద్దై ప్రస్తుతం ఎంసీఏ చదువుతోంది శశికళ. రోజూ ఇంటి నుంచి దువ్వాడ లోని కాలేజీకి వెళ్లేది. అయితే, రోజూ ఇలా అప్ అండ్ డౌన్ చేయటం ఇబ్బందిగా మారటంలో దువ్వాడలో హాస్టల్ లోనే ఉండటానికి నిర్ణయించుకుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. మరికొన్ని రోజుల్లో హాస్టల్ కు వెళ్లి పోవాలి. ఈ నేపథ్యంలోనే ప్రమాదవాశాత్తు దువ్వాడ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్-రైలు మధ్య ఇరుక్కుపోయి..తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.