శశికళ.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ విద్యార్థిని మరణం కలచివేస్తోంది. ఉన్నత చదువులు చదువుకుని తల్లిదండ్రులను ఆనంద పెట్టాలి అనుకుంది. కానీ, దువ్వాడ రైల్వే స్టేషన్ లో కాలుజారి రైలు కింద పడటం వల్ల ఆమె ఆశలు అన్నీ అడియాసలు అయ్యాయి. 30 గంటలు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. అపస్మారకస్థితిలోనే ఆమె కన్నుమూసింది. పెళ్లైన ఆరేళ్ల తర్వాత ఎన్నో పూజలు, నోములు నోస్తే పుట్టిన ఒక్కగానొక్క కుమార్తెను కోల్పోయిన ఆ తల్లిందండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. శశికళ ప్రమాదం గురించి తెలిసిన తర్వాత అక్కడి విద్యార్థులు కూడా రైలు అంటేనే ఉలిక్కిపడే పరిస్థితి ఉంది. శశికళ స్నేహితురాళ్లు అయితే ఆమె తల్చుకుని కుమిలిపోయారు.
“మేము శశికళ కంటే ముందే కాలేజీకి వెళ్లిపోయాం. కాలేజ్‌కి వెళ్లిన తర్వాత మాకు ఈ విషయం తెలిసింది. వీడియోల్లో శశికళను చూసిన తర్వాత పెద్దగా గాయాలు కాలేదు అనుకున్నాం. ఆమె కాలు ఇరుక్కుంది. బయటకు తీసిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది అనుకున్నాం. అందరం ఆమె కోసం ఎంతగానో ప్రార్థించాం. ఆమె క్షేమంగా కాలేజ్‌కి వస్తుంది అనుకున్నాం. కానీ, ఇలా అందరినీ వదిలేసి వెళ్లిపోతుంది అనుకోలేదు. ఆమె తల్లిదండ్రులు కూడా శశికళపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంచిగా చదువుకుని జాబ్ చేస్తుందని కలలు కన్నారు. శశికళ కూడా బాగా చదువుకుని సెటిల్ అవ్వాలి అనుకునేది. ఇలా జరగడం అందరినీ ఆందోళనకు గురి చేసింది” అంటూ శశికళ ఫ్రెండ్స్ ఎమోషనల్ అయ్యారు.
“ఈ ఘటన గురించి తెలుసుకున్న తర్వాత మా తల్లిదండ్రులు కూడా ఎంతో భయపడుతున్నారు. ఇంటి దగ్గరి నుంచి వద్దు.. హాస్టల్ లో జాయిన్ చేస్తామంటూ చెబుతున్నారు. రైలు ఎక్కేటప్పుడు, దిగే సమయంలో జాగ్రత్తగా ఉండమంటున్నారు. రన్నింగ్ ట్రైన్ ఎక్కద్దంటూ హెచ్చరిస్తున్నారు. మాకు కూడా శశికళకు జరిగింది చూసిన తర్వాత ఎంతో భయంగా ఉంది. ఇప్పుడు కూడా ట్రైన్ దిగే సమయంలో చాలా భయం వేసింది. ఆగిఉన్న ట్రైన్ అయినా కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని దిగుతున్నాం. శశికళకు అలా జరగాల్సింది కాదు. ఆమె కాలేజ్‌కి వస్తుందని ఎంతగానో ఆకాంక్షించాం. అన్నవరం నుంచి దువ్వాడ వరకు వచ్చి ఎంతో కష్టపడి చదివేది. ఇలా జరుగుతుంది అస్సలు అనుకోలేదు” అంటూ శశికళ ఫ్రెండ్స్ ఆవేదన వ్యక్తం చేశారు.