మత్సకారులు చేపల పట్టుకుని విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. నిత్యం చేపల వేట కోసం సముద్రాలు, కాలువల వద్దకు జాలర్లు వెళ్తుంటారు. అయితే ఇలా వారు చేపల కోసం వల వేసిన సందర్భాంలో వింత జీవులు చిక్కుతుంటాయి. దీంతో భారీ ఆకారం ఉన్న చేపలను చూసి జాలర్లు ఆశ్చర్యపోతుంటారు. తాజాగా చేపల కోసం కాలువలో వల వేసిన ఇద్దరు జాలర్లకి గట్టి షాక్ తగిలింది. చేపల కోసం వల విసరగా అందులో భారీ చేప దొరికింది. మొదట దాన్ని సార్క్ చేపగా భావించి.. చివరకు డాల్ఫిన్ అని తెలిసి నీటిలో వదిలేశారు. అయితే చివరకు సముద్రంలోకి తరలించే ప్రయత్నం చేయగా మరణించింది. ఈ డాల్ఫిన్ ను చూసేందుకు ఆ కాలువ వద్దకు పెద్ద ఎత్తున స్థానికులు వచ్చారు. ఈ ఘటన కాకినాడ జిల్లా పెద్దపూడి కాలువలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాకినాడ జిల్లా పెద్దపూడిలోని సాగునీటి కాలువలో అరుదైన డాల్ఫిన్ కనువిందు చేసింది. గురువారం మధ్యాహ్నం కొందరు పెద్దపూడి కాలువలో చేపల వేటకు వెళ్లినట్లు సమాచారం. ఈ సమయంలో వారికి డాల్ఫిన్ కనిపించింది. మొదట దానిని సార్క్ చేపగా భావించారు. చివరకు డాల్ఫిన్ అని తెలియడంతో తిరిగి కాలువలోనే వదిలేశారు. నీరు తక్కువగా ఉండటంతో డాల్ఫిన్ పైకి తేలుతూ ఇబ్బంది పడుతూ కనిపించింది. ఇదే సమయంలో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని దానిని చూసేందుకు ఆసక్తి చూపించారు.
ఈ క్రమంలోనే కొందరు అధికారులకు సమాచారం అందించగా.. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. దానిని సముద్రంలోకి తరలించే ప్రయత్నం చేశారు. స్థానికుల సాయంతో కాలువలో నుంచి డాల్ఫిన్ ను బయటకు తీసుకొచ్చి ఆటోలో జాగ్రత్తగా అచ్చుతాపురం వంతెన వద్ద ఉన్న ఏలూరు కాలువలో వదిలేశారు. అయితే కాలువలో వదిలే సమయానికే ఆ డాల్ఫిన్ మరణించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే బయటకు తీసి ఫ్రీజ్ లో భద్రపరిచారు.
శుక్రవారం అధికారుల సమక్షంలో వన్యప్రాణి చట్టప్రకారం దానికి పోస్టు మార్టం నిర్వహించారు. అనంతరం డాల్ఫిన్ కళేబరాన్ని ఖననం చేశారు. అయితే ఈ డాల్ఫిన్ సముద్రం నుంచి ఉప్పుటేరు ద్వారా ఏలూరు కాలువ నుంచి స్థానిక సరస్సులోకి ఈ డాల్ఫిన్ వచ్చి ఉండొచ్చునని మత్స్యకారులు, అధికారులు భావిస్తున్నారు. కాలువలో డాల్ఫిన్ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.