జాతి వైరం అనేది జంతువులకు, జంతువులకూ మధ్య ఉండడం సహజమే. కానీ కొన్ని సందర్భాల్లో ఎలాంటి జాతి వైరం లేకుండా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తాయి. గతంలో ఆవు దూడకి ఒక కుక్క పాలివ్వడం గానీ, పందికి ఆవు పాలు ఇవ్వడం గానీ, అలానే ఒక బాలుడికి ఆవు తల్లిలా దగ్గరకు తీసుకుని పాలు ఇవ్వడం గానీ ఇలా ఆశ్చర్యపోయే విధంగా జంతువులు మిగతా జీవుల పట్ల ప్రేమను చూపించాయి. తాజాగా ఒక శునకం ఒక మేకపిల్లను పుట్టినప్పటి నుంచి పాలిస్తూ వస్తుంది.
ఒక శునకాన్ని కుక్కా కుక్కా ఏం చేస్తావ్ అంటే.. నేను చీప్ గా వీధి కుక్కల్లా మనుషులను కరవము, ఎవరికీ హాని చేయము. ఇంకా ఆకలి అన్న జీవుల ఆకలి తీరుస్తాము అని అంటున్నాయి. మనకర్ధమయ్యే భాషలో చెప్పడం దానికి రాకపోయినా.. మనం అర్ధం చేసుకునే చేతల భాషలో అది రుజువు చేసింది. ఆకలిగా ఉన్న ఒక మేక పిల్ల ఆకలి తీర్చిందో శునకం. కుక్కల్లో సాధుతత్వం కోల్పోతున్న తరుణంలో కుక్కల ప్రేమికులు బాహుబలి సినిమాలో బిజ్జలదేవలా కాలర్ ఎగరేసుకుని మరీ ‘మా కుక్క’ అని మెచ్చుకునేలా ఒక కుక్క అమ్మతనాన్ని ప్రదర్శించింది. మనిషి మనిషికి సాయం చేస్తే అది మానవత్వం అంటాం. మరి జంతువులు కూడా మరొక జంతువులకు సాయం చేస్తే ఏమనాలి? జంతుతత్వం అంటే మన భాషలో వేరే అర్ధం వస్తుందేమో. అంతకు మించిన పదం వాడాలేమో.
మనిషిలో దేవుడ్ని చూడడమే దైవత్వం అంటారు. అయితే మనిషిలోనే కాదు ప్రతీ జీవిలోనూ దేవుడు ఉంటాడు అనడానికి అనేక సంఘటనలు ఉన్నాయి. దేవుడు అంటే సాయం. కష్టాల్లో ఉన్నవారిని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ఇవే.. ఈ చిన్న చిన్న సాయాలే దేవుడంటే. తాజాగా ఒక శునకం మేకపిల్లకు పాలిస్తూ దైవత్వాన్ని చాటింది. ఏదో ఒకరోజు అనుకోకుండా ఇచ్చిందంటే గొప్పగా ఫీలవ్వకపోవచ్చు. కానీ రోజూ మూడు పూటలూ మేక దగ్గరకు వెళ్లి పాలిచ్చి వస్తుంది. మేత లేక మేకలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో అవి పిల్లలకు పాలు సరిగా ఇవ్వలేకపోతున్నాయి. అయితే ఈ కుక్క మనసు చలించింది కాబోలు కేజీఎఫ్ లో రాకీ భాయ్ లా మేక దగ్గరకు వెళ్లి ఆకలి తీరుస్తుంది.
ఇది అనంతపురంలోని కళ్యాణ్ దుర్గ అనే పట్టణంలో ఉన్న దొడగట్ట గ్రామంలో జరుగుతున్న సంఘటన. దొడగట్ట గ్రామానికి చెందిన మేకల కాపరి గొల్ల ఓబులపతికి 30 మేకలు ఉన్నాయి. వీటిలో ఒక మేక 15 రోజుల క్రితం ఒక మేకపిల్లను జన్మనిచ్చింది. అయితే ఆ తల్లి మేకకు పిల్లకు ఇవ్వడానికి తగిన పాలు లేవు. అదే సమయంలో మేకల దొడ్డి వద్ద ఓ కుక్క నాలుగు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. మేకల కాపరి కుక్కను మేకల దొడ్లోకి పిలవగా ఆ కుక్క వెళ్ళింది. కుక్క పిల్లలు పాలు తాగడం చూసి ఆ మేకపిల్ల ఆ కుక్క దగ్గరకు వెళ్లి పాలు తాగడం ప్రారంభించింది. కుక్క కూడా ఏమీ అనలేదు. ఇలా 15 రోజుల నుంచి ఆ కుక్క మేకపిల్లను పాలిస్తూ వస్తుంది. కుక్కలను చూస్తే మేకలు భయపడి పారిపోతాయి. అలాంటిది ఈ మేకపిల్ల కుక్కను తల్లిగా భావించి పాలు తాగడానికి వెళ్తుంది. మరి జాతి వైరం లేకుండా ఒక కుక్క దగ్గర పాలు తాగుతున్న ఈ మేకపిల్లపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.