నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం తొలి రోజే అపశృతి చోటు చేసుకుంది. పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన నందమూరి తారకరత్న.. తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. పాదయాత్ర సందర్భంగా మసీదులో ప్రార్థనలు నిర్వహించి బయటకు వస్తుండగా.. తారకరత్న స్పృహ తప్పి పడి పోయాడు. తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నకు స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి.. ఆ తర్వాత మెరుగైన వైద్యం పీఎస్‌ఈ ఆస్పత్రికి తరలించారు.
పీఎస్‌ఈ వైద్యులు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వివరాలు వెల్లడించారు. ఆయనను ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో పల్స్ లేవని వైద్యులు తెలిపారు. తారకరత్న శరీరం నీలం రంగులోకి మారిందని.. వెల్లడించారు. వెంటనే చికిత్స అందించామని.. సుమారు 45 నిమిషాల వరకు పల్స్ అందలేదని.. ఆ తర్వాతే పల్స్ మొదలైందని వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు ఆస్పత్రికి తరలించాం అన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నామన్నారు వైద్యులు. అంతేకాక తారకరత్నకు యాంజియోగ్రామ్ చేసినట్లు వెల్లడించారు. తారకరత్న పరిస్థితి తెలిసిన వెంటనే.. బాలకృష్ణ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయనను బెంగళూరుకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.