తిరుమల శ్రీవారి దర్శనం కోసం నడిచి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి బోర్డు శుభవార్త అందించింది. ఇకపై శ్రీవారి దర్శనం మరింత సులువు కానుంది. మిగిలిన వివరాలు..
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి తిరుమలకు చేరుకుంటారు. కొందరు బస్సులు, ప్రైవేటు వాహనాల్లో తిరుమలకు చేరుకుంటే.. మరికొందరు నడక మార్గం ద్వారా కొండపైకి వస్తుంటారు. అలా నడకదారిలో వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో వచ్చే భక్తులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి దివ్యదర్శనం టోకెన్లను జారీ చేయనుంది. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలిపిరి నడక దారిలో రోజుకు 10 వేల టోకెన్లను జారీ చేస్తామని ఆయన తెలిపారు. సోమవారం తిరుమలలో వేసవి ఏర్పాట్ల మీద ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడారు.
శ్రీవారి మెట్టు నడక దారిలో రోజుకు 5 వేల టోకెన్లను జారీ చేయనున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. వేసవిలో బ్రేక్ సిఫార్సు లేఖలను తగ్గిస్తామని ఆయన అన్నారు. ఫేస్ ఐడెంటిఫికేషన్తో పారదర్శకంగా వసతి సౌకర్యం కేటాయింపులు చేస్తున్నామని చెప్పారు. ఎండాకాలంలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. కాగా, కరోనాకు ముందు నడిచి వెళ్లే భక్తులకు దివ్యదర్శన టోకెన్లను టీటీడీ జారీ చేసిన సంగతి విదితమే. కొవిడ్ టైమ్లో వీటిని నిలిపివేసిన టీటీడీ.. తాజాగా మళ్లీ నడిచి వెళ్లే భక్తుల కోసం దివ్యదర్శన టోకెన్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.