భర్తల బంధంలో నమ్మకం చాలా ముఖ్యం. పచ్చని సంసారాన్ని ఈ నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. మీ ఆయన ఫలానా మహిళతో చనువుగా ఉంటున్నారనే, నీ భార్య మరో మగవాడితో ఇకిలిస్తుందని, డబ్బులు దుబారా చేస్తుందని బంధువులు, ఇరుగు, పొరుగు, స్నేహితుల చెప్పుడు మాటలకు వినడం, అవి ఇద్దరి మధ్య అగ్గిని రాజేసి, అపార్థాలకు తావినిస్తుంది. అటువండి చాడీలే ఆ యువతిని 11 ఏళ్లకు పైగా చీకటి గదికి పరిమితం చేశాయి.
ఎన్నో కళలతో అత్తవారింట అడుగుపెడతారు మహిళలు. మెట్టినిల్లు, మరో పుట్టినిల్లు అవుతుందని భావిస్తారు. కానీ భర్త, ఆడపడుచు, అత్తల సూటిపోటి మాటలతో ఆ ఇల్లు నరక ప్రాయంగా మారితే ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి. వేదన అనుభవిస్తూనే జీవితాన్ని సాగిస్తారు. మన ఇంటికి వచ్చిన ఆడపిల్లను మన ఇంట్లో పిల్లలా చూసుకోవాల్సిన అత్తింటి వారు చెప్పుడు మాటలతో హింసకు గురి చేస్తారు. ఈ చెప్పుడు మాటలే ఓ మహిళను చీకటి కొట్టంకు పరిమితం చేశాయి. తల్లి, తమ్ముడు మాటను విని కట్టుకున్న భార్యను గదిలో పెట్టి బంధించాడో ప్రబుద్ధుడు. ఒకటి రెండు సంవత్సరాలు కాదూ ఏకంగా 11 ఏళ్ల పాటు ఆమెను చీకటి గదికి పరిమితం చేశాడు. పోనీ అతడు చదువుకోని మూర్ఖుడా అంటే పొరపాటు. సమాజంలో మంచి పలుకుబడి ఉన్న లాయర్
వివరాల్లోకి వెళితే విజయనగరం కంటోన్మెంట్ బాలాజీ మార్కెట్ సమీపంలో నివాసి, లాయర్‌గా పనిచేస్తున్న గోదావరి మధుసూదన్‌కు శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సాయి సుప్రియకు 2008లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. మధుసూదన్ తన తల్లి గోదావరి ఉమామహేశ్వరితో పాటు తన తమ్ముడు దుర్గాప్రాద్ తో కలిసి ఉంటున్నారు. అయితే తల్లి, తమ్ముడు చెప్పుడు మాటలు విని భార్యను బయట ప్రపంచానికి దూరం చేస్తూ గదిలో బంధించాడు. ఎప్పుడు కూడా బయటకు తీసుకురావడమే కాదూ మిగిలిన గదుల్లోకి కూడా తీసుకెళ్లేవాడు కాదూ. పిల్లల్ని కూడా ఆమె గదిలోకి వెళ్లనిచ్చేవాడు కాదూ. ఏకంగా పదకొండేళ్లకు పైగా ఆమెను చీకటి గదికలో బంధీని చేశారు. చివరికి కుమార్తె కోసం ఆమె తల్లిదండ్రులు న్యాయస్థానం మెట్లెక్కారు.
సుప్రియను ఎమ్ ఎ లిటరేచర్ వరకు తల్లిదండ్రులు చదివించారు. అనంతరం మధుసూదన్ కు ఇచ్చి వివాహం చేశారు. రెండు మూడేళ్ల పాటు సంసారం సక్రమంగా సాగిపోగా.. ఆ తర్వాత సుప్రియకు కష్టాలు మొదలయ్యాయి. తల్లి,తమ్ముడు మాటలతో ఆమెను గదిలో పెట్టి హింసించాడు భర్త. ఎవ్వరితో మాట్లాడనిచ్చేవారు కాదూ. చివరికి సుప్రియ తల్లిదండ్రులు ఫోన్ చేసినా ఫలితం శూన్యం. కుమార్తె గురించి మధుసూదన్ ను సుప్రియ తల్లిదండ్రులు, ఇతర బంధువులు అడిగితే మాట దాటేసేవాడు. ఎవరైనా గట్టిగా అడిగితే తాను లాయర్ నని బెదిరించేవాడు. తమ కుమార్తె బతికి ఉందో లేదో తెలియక చివరికి న్యాయ పోరాటానికి దిగారు.
సహనం కోల్పోయిన సుప్రియ తల్లిదండ్రులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఒకటవ పట్టణ పోలీసులు ఫిబ్రవరి 28వ తేదీన గోదావరి మధుసూదన్ ఇంటికి వెళ్లారు. ‘మా ఇంటిని తనిఖీ చేసే అధికారం మీకు లేదు, తనిఖీ చేసేందుకు కోర్టు ఆదేశాలు ఏమైనా ఉన్నాయా’ అని పోలీసులను ఆయన ఎదురు ప్రశ్నించాడు. దీంతో పోలీసులు, బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సెర్చ్ వారెంట్ తీసుకువచ్చారు. అనంతరం సెర్చ్ చేయగా.. ఓ చీకటి గదిలో బంధీగా పడి ఉంది. ఆమెను బయటకు తీసుకురాగా, చిక్కి శిల్యమై కనిపించింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. అత్తవారింటి పెట్టిందే తింటూ, వారి వేధింపులకు బలైంది. ఆమెను బయటకు తీసుకువచ్చిన పోలీసులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితులపై చర్యలు తీసుకుంటామని ఒకటవ పట్టణ సీఐ వెంకటరావు తెలిపారు. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి ఇలా చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.