తమ స్వార్థం కోసం పరిచయాన్ని స్నేహంగా మలుచుకుని, వారిని నమ్మేలా చేసి ఆ తర్వాత నట్టేట ముంచుతున్నారు కొందరు. స్నేహం కారణంగా ఓ వివాహిత ప్రాణాలను పోగొట్టుకున్న ఘటన విశాఖ పట్నం జిల్లా భీమిలిలో వెలుగు చూసింది.
కొన్ని పరిచయాలు మంచి పరిణామాలకు దారి తీస్తే.. మరికొన్ని చెడు చేస్తున్నాయి. తమ స్వార్థం కోసం పరిచయాన్ని స్నేహంగా మలుచుకుని, వారిని నమ్మేలా చేసి ఆ తర్వాత నట్టేట ముంచుతున్నారు. నమ్మిన వ్యక్తి గొంతు కోస్తున్నారు. స్నేహం కారణంగా ఓ వివాహిత ప్రాణాలను పోగొట్టుకున్న ఘటన విశాఖ పట్నం జిల్లా భీమిలిలో వెలుగు చూసింది. 10 రోజుల క్రితం కనిపించకుండా పోయిన మహిళ..చిలకూరి లే అవుట్ గెడ్డలో మహిళ మృతదేహం కనిపించింది. ఆమెను తగరపు వలస బాలాజీ నగర్ కు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు.
బంగారం కోసం మహిళను హత్య చేశాడో డ్రైవర్. వివరాల్లోకి వెళితే మహిళ కనిపించడం లేదంటూ ఈ నెల 2న భీమిలీ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. అప్పటి నుండి ఆమె కోసం వెతుకుతున్నారు. అయితే తాజాగా ఆమె ఓ పొదల్లో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. తప్పిపోయిన మహిళగా గుర్తించారు. ఆటో డ్రైవర్ రాజును అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రాథమిక విచారణలో ఆటో డ్రైవర్ ఆమెను హత్య చేసినట్లు నిర్ధారణైంది. మహిళతో ఆటో డ్రైవర్ రాజుకు గతంలో పరిచయం ఉండగా.. అతడితో వెళ్లిన తర్వాత.. హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. బంగారం కోసం ఆమెను చంపినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.