భర్త, అత్త, మామలతో విబేధాలతో మహిళలు మానసికంగా కుంగిపోతున్నారు. పుట్టింటికి వెళ్లి బాధను వెళ్లగక్కుదామన్న.. సమస్య వినడం కన్నా.. ఆమెను సర్థి చెప్పే ప్రయత్నాలు చేస్తుంటారు తల్లిదండ్రులు. దీంతో తప్పు తమదే అని భావించి కొంత మంది వివాహితలు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
కుటుంబ కలహాల కారణంగా వివాహిత మహిళలు తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. భర్త, అత్త, మామలతో విబేధాలు వారిని మానసికంగా కుంగదీస్తున్నాయి. అటు పుట్టింటికి వెళ్లి బాధను వెళ్లగక్కుదామన్న.. సమస్య వినడం కన్నా.. ఆమెను సర్థి చెప్పే ప్రయత్నాలు చేస్తుంటారు తల్లిదండ్రులు. దీంతో తనదే తప్పు అన్న భావనలో పడిపోయి.. కొంత మంది మహిళలు ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోవడం లేదంటే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా విశాఖ బీచ్‌లో అనుమానాస్పద రీతిలో ఓ వివాహిత మృతదేహం కనిపించడం కలకలం రేపింది. అయితే ఆమె గర్భిణి కావడం విషాదకరం.
బుధవారం ఉదయం విశాఖ బీచ్ వద్ద వాకింగ్ చేసేందుకు వచ్చిన వాకర్లు.. ఇసుకలో కూరుకున్న మహిళ మృతదేహాన్ని చూసి అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సగం శరీరం ఇసుకలో కూరుకుపోయి..అర్థనగ్నంగా ఉన్న పరిస్థితిలో మృతదేహం ఉంది. అయితే ఆమెను గాజువాక నడుపూరుకు చెందిన శ్వేతగా పోలీసులు గుర్తించారు. మంగళవారం సాయంత్రం అత్తారింటి నుండి బయటకు వెళ్లిన శ్వేత తిరిగి రాకపోవడంతో చుట్టు పక్కల ఆరా తీశారు. ఆమె ఆచూకీ ఎంతకూ తెలియకపోవడంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అయితే ఈ రోజు ఆర్కే బీచ్ సమీపంలోని వైఎంసీఎ బీచ్ ప్రాంతంలో శవమై తేలింది. ఆమె మృతదేహం కనిపించిన తీరు పలు అనుమానాలకు తావునిస్తుంది. ఆమె ఆత్మహత్య చేసుకుందా..లేక హత్య అనేది పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఏడాది క్రితమే ఆమెకు వివాహం కాగా, ప్రస్తుతం ఐదు నెలల గర్భిణీ. భర్త హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అత్తారింట్లో కలహాల కారణంగానే ఆమె మనస్థాపం చెంది ఇలా చేసుకుందా.. లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఆమె భర్తతో అరగంట సేపు మాట్లాడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ విషయంపై భర్త మందలించడంతోనే ఆమె ఇలా చేసిందా అనేది తెలియాల్సి ఉంది.