తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రమాదాల్లో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు.మొన్నటికి మొన్న అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. కరీనంగర్‌లో కుక్కల దాడిలో 13 ఏళ్ల బాలిక బలైంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఆరేళ్ల పాప పాము కాటుకు గురై చనిపోయింది. తాజాగా విజయవాడలో విషాదం నెలకొంది.
ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రమాదాల్లో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు.మొన్నటికి మొన్న అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇదీ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతే కాకుండా కరీనంగర్‌లో కుక్కల దాడిలో 13 ఏళ్ల బాలిక బలైంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఆరేళ్ల పాప పాము కాటుకు గురై చనిపోయింది. మొక్కజొన్న గింజ ఇరుక్కొని మూడేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. నిన్నటి నిన్న జీహెచ్‌ఎంసీ ట్రక్కు కింద పడి 18 నెలల బాలుడు మరణించాడు. ఈ ఘటనలన్నీ రెప్పపాటులో జరిగిపోతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో మరో విషాదం నెలకొంది.
8 నెలల శిశువు వేడినీళ్ల బకెట్‌లో పడి మృతి చెందిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిట్టి నగర్ లంబాడి పేట గాంధీ బొమ్మ ప్రాంతంలో ఆదిమల్ల ప్రణితి, ప్రేమ్ కుమార్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒక పాప ప్రాఖ్య ఉంది. ఈ పాపకు 8 నెలలు. అయితే ఇంట్లో వేడి నీళ్లు కోసం వీరు వాటర్ హీటర్‌ను వాడుతున్నారు. ఈనెల 27వ తేదీన వేడి నీళ్ల కోసం ఎప్పటి లాగానే వాటర్ హీటర్‌ను పెట్టారు. పాప మంచం పక్కనే ప్లగ్ ఉండటంతో అక్కడ వేడి నీళ్ల కోసం బకెట్ ఉంచారు. అయితే వాటర్ హీటర్ పెట్టిన తర్వాత పనిలో పడిపోయింది ప్రణితి. ఆ సమయంలో భర్త కూడా ఇంట్లో లేడు. కాసేపటికి పాప ఏడుపు వినిపించడంతో తల్లి.. వెంటనే గదిలోకి పరుగులు తీసింది.
అయితే అప్పటికే ప్రాఖ్య ఆ వేడి నీటి బకెట్లో పడిపోయి కనిపించింది. వెంటనే స్విచ్ ఆఫ్ చేసి పాపను బయటకు తీసేసరికి చిన్నారి శరీరమంతా కాలిపోయింది. ఈ హడావుడికి అక్కడికి చేరుకున్న స్థానికులతో కలిసి పాపను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 29వ తేదీ రాత్రి ఆ చిన్నారి మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కగానొక్క పాప మృత్యువాత పడటంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. ఆ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.