తల్లిదండ్రులు కొట్టారని,ప్రేమించిన వ్యక్తి బ్రేకప్ చెప్పారని లేదా మరొకరితో వివాహం జరిగిందని,లేదా ఫెయిలవుతామన్న భయంతో కొంత మంది సూసైడ్ చేసుకుంటున్నారు. బాధకు కారకులవ్వడమో లేదా తమ బాధను చెప్పినా వినిపించుకోక పోవడమే, వారి పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడమో ఆత్మహత్యకు దారి తీస్తున్న అంశాలు అవుతున్నాయి.
ఇటీవల కొంత మంది చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్న కారణాల గురించి తెలిస్తే.. ఈ విషయానికే ప్రాణాలు తీసుకుంటున్నారా అని ఆలోచిస్తుంటాం. ఆ చిన్న కారణమే వారికి బలీయమైన అంశంగా మార్చి, ఆలోచన శక్తి కోల్పోయేలా చేసి, బలవన్మరణాలకు ప్రేరేపితం చేస్తుంది. బాధకు కారకులవ్వడమో లేదా తమ బాధను చెప్పినా వినిపించుకోక పోవడమే, వారి పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడమో, ఆ సమయంలో ఓదార్పు లేక తమను తాము బలితీసుకుంటున్నారు. తాజాగా భర్త నిర్లక్యం కారణంగా భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
పక్కింటి వారితో జరుగుతున్న గొడవల విషయంలో భర్త పట్టించుకోకపోవడంతో ప్రియాంక(25) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని బోగోలు మండలంలో చోటుచేసుకుంది. ఇన్‌చార్జి ఎస్‌ఐ ఆదిలక్ష్మి కథనం ప్రకారం.. కడనూతల దళితవాడలో హర్ష, ప్రియాంక దంపతులు ఉంటున్నారు. ప్రియాంకకు హర్షతో వివాహమై పదేళ్లు కాగా, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ప్రియాంకకు పక్కింటి వారితో గొడవలు ఉన్నాయి. ఈ విషయం భర్తకు చెప్పగా ఆయన పట్టించుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన మహిళ రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి కొప్పోలు పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న కావలి రూరల్ సీఐ రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం ప్రియాంక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందచేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.