తమ ముద్దు ముద్దు మాటలతో చిలక పలుకులు పలుకుతూ ఉన్న చిన్నారులు.. అకాల మరణం చెందుతున్నారు. ఎటు నుండి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియడం లేదు. తాజాగా ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని కారు బలిగొంది.
ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన చిన్నారులు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. ఊహించని ప్రమాదాలు వారి ఊపిరి తీస్తున్నాయి. ముద్దు ముద్దు మాటలతో చిలక పలుకులు పలుకుతూ ఉన్న చిన్నారులు.. అకాల మరణం చెందుతున్నారు. ఎటు నుండి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియడం లేదు. మొన్నటి వరకు కుక్కల కారణంగా కొంత మంది చిన్నారులు చనిపోతే.. నిన్నటికి నిన్నవర్షాల కారణంగా.. నాలాలో పడి ఓ చిన్నారి మరణించిన సంగతి విదితమే. తాజాగా ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని కారు బలిగొంది. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కాకినాడలోని కాజులూరు మండలం కోలంక గ్రామంలో విషాదం నెలకొంది. కారులో ఊపిరాడక ఎనిమిదేళ్ల చిన్నారి అనంత లోకాలకు వెళ్లిపోయింది.కోలంక గ్రామానికి చెందిన తొగరు ఆదిలక్ష్మికి ఇద్దరు పిల్లలు. భర్త గత ఏడాది చనిపోవడంతో పాచి పనులు చేసుకుంటూ ఇద్దరి పిల్లల్ని పోషిస్తుంది. అయితే రోజులానే ఆదిలక్ష్మి పనికి వెళ్లగా.. తనతో పాటు వెళ్లిన కూతురు అఖిలాండేశ్వరి (8) ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆటలు ఆడుకుంటూ సమీపంలో పార్క్ చేసిన కారులోకి ఎక్కి డోర్ వేసుకుంది. తిరిగి డోర్ తీయడం రాకపోవడంతో అందులోనే ఉండిపోయింది. పాప.. అమ్మ దగ్గరకు వెళ్లిందని భావించిన ఆదిలక్ష్మి తన పనిలో పడిపోయింది.
అయితే సాయంత్రమైన పాప రాకపోయేసరికి అడగ్గా.. కనిపించడం లేదని గుర్తించారు. పాప ఆచూకీ కోసం అందరూ వెతికారు. ఆ సమయంలో కారు దగ్గర పాప వేసుకున్న డ్రస్ కొన కనిపించగా.. డోర్ తెరిచి చూడగా కొన ఊపిరితో అఖిలాండేశ్వరి కొట్టుకుంటుంది. ఆమెను వెంటనే యానాంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఏడాది క్రితం భర్త చనిపోగా.. ఇద్దరి పిల్లలను పెట్టుకుని పాచి పని చేసుకుంటూ.. వారి కోసమే బతుకుతున్న తల్లి..కుమార్తె మృతి చెందిందని తెలిసి కన్నీరుమున్నీరవుతోంది.