తెలుగు రాష్ట్రాల్లో సీపీఐ నారాయణ అంటే ప్రత్యక పరిచయం అవసరం లేదు. ఏ విషయం అయినా ఆయన వినూత్నంగా నిరసన తెలుపుతుంటారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చెప్పులపై 12 శాతం జీఎస్టీ విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ రోజుకోలా నిరసన తెలుపుతున్నారు. ఇటీవల నెత్తిపై చెప్పులు పెట్టుకుని నిరసన తెలిపిన ఆయన.. నిన్న చెప్పులు కుట్టి, పాలిష్ చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. పేదలు చెప్పులు కూడా వేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచిందన్నారు. చెప్పులపై విధించిన జీఎస్టీని వెనక్కి తీసుకోకపోతే చెప్పులతోనే నిరసన వ్యక్తం చేయక తప్పదని హెచ్చరించారు నారాయణ. సామాన్యుడి కష్టం తనకు తెలుసు కాబట్టే నెత్తిన చెప్పులు పెట్టుకున్నానని అన్నారు. కార్పొరేట్లకు బీజేపీ అనుకూలంగా ఉంటుందని ఆరోపించారు. మద్యాన్ని తక్కువ ధరలకు ఇస్తామంటున్న బీజేపీ.. చెప్పులపై మాత్రం తగ్గించరా? అని ప్రశ్నించారు.
ఇది చదవండి : దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ!
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీయడానికి కేంద్రమే కారణం అని ఆరోపించారు నారాయణ. ఢిల్లీ వెళ్లిన సీఎం ప్రత్యేక హోదా, పెండింగ్ ప్రాజెక్టులపై ప్రధానిని నిలదీయాలని సూచించారు. ఇక గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం, చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో అంబేద్కర్ విగ్రహాన్ని కూలదోయడానికి ప్రయత్నించడం శోచనీయమని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఏపిలోని సినిమా టికెట్ల వివాదంపై మాట్లాడుతూ.. సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.