బంగారం పేరు చెబితే చాలు మహిళలు చంద్ర ముఖిలా మారిపోతుంటారు అంటారు కానీ.. ఆపదలో ఆదుకునేది ఆ వస్తువే. అందుకే భర్తలను పోరు పెట్టైనా సరే బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు మహిళలు. దీనిపై ఆసక్తినే క్యాష్ చేసుకుంటున్నారు కొందరు మోసగాళ్లు.
భారత్‌లో బంగారానికి ఉన్నా క్రేజ్ వజ్రానికి, ప్లాటినానికి కూడా లేదు. వివాహాలు, పండుగలు, వేడుక ఏదైనా బంగారం ధరించేందుకు మహిళలు ఆసక్తి కనబరుస్తుంటారు. ధరలు పెరుగుతున్నాయంటే చాలు దిగులు పడిపోతారు మధ్యతరగతి మహిళలు. అవే తగ్గుతున్నాయంటే ఏ వస్తువు చేయించుకోవాలని రాత్రి నుండి ప్రణాళికలు రచిస్తుంటారు. అంతలా మహిళలకు, బంగారంతో విడదీయ రాని సంబంధం ఉంది. బంగారం వస్తువులు ఇప్పుడు స్టేటస్‌గా కూడా మారిపోయాయి. ఎంత బంగారం తొడిగితే.. అంత గౌరవంగా మారిపోయింది. అంతేకాకుండా అవసరానికి అక్కరసు వస్తాయి ఇవి. అందుకే బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇదే ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ జంట అడ్డంగా బుక్కయ్యింది.
‘మా దగ్గర 24 క్యారెట్ల బంగారం ఉంది. మాకు డబ్బులు అవసరం అందుకే మీకు తక్కువగా ఇచ్చేస్తున్నాం. ఇంత తక్కువకు బయట ఎవ్వరు ఇవ్వరు. కొనుక్కుంటే మీకే లాభం’అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిందో జంట. తక్కువకే వచ్చేస్తుంది కదా అని, మరొకరికి ఆ అవకాశం దక్కేస్తుందేమోన్న అత్యాశకు పోయి.. ఆ జంట నుండి బంగారాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఖంగు తినడం మోసపోయిన వాళ్ల వంతైంది. వారు అమ్మిన బంగారం నకిలీదని తెలిసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు బాధితులు. రంగంలోకి దిగిన పోలీసులు మోసం చేయడంలో ఆదర్శంగా నిలిచిన జంటను అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన చెంబేటి బుల్లయ్యా, చెంబేటి కనకమ్మ దంపతులు. పని చేసుకుని బతకాల్సిన ఈ ఇద్దరు మోసాలకు మరిగారు. ఓ ఇనుప కడ్డీని బంగారం పూత పూసి, అసలైన 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ అని స్థానికులను నమ్మించారు. ఈ నకిలీ బంగారాన్ని లక్ష తొంభై వేలకు అమ్మేశారు. కొనుకున్న బాధితులు.. ఆ బిస్కెట్‌ను తీసుకెళ్లి వస్తువు చేయించుకునేందుకు బంగారం దుకాణం వద్దకు పోయారు. తీరా అక్కడి తనిఖీలో అదీ ఇనుప కడ్డీకి బంగారం పూత పూశారని తేలింది. దీంతో తాము మోసపోయామని భావించిన బాధితులు.. లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు చేరారు. కేసు నమోదు చేసిన పోలీసులు దంపతులను అరెస్టు చేశారు. ఒళ్లు వంచి పనిచేయలేక.. ఇలా మోసాల బాట పడుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.