సాయం చేయాలంటూ తన దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా నిలిచారు. ఆ వ్యక్తి మొర విని ఆయనకు తక్షణమే సాయం అందేలా చూశారు.
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలంటే మంచి మనసు కావాలి. సాయం చేయాలంటూ తమ దగ్గరకు వచ్చిన వారిని అక్కున చేర్చుకొని, అండగా నిలిచే మనసు కొందరికే ఉంటుంది. అలాంటి గొప్ప మనసు తనకు ఉందని మరోమారు చాటుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన సీఎం జగన్.. బహిరంగ సభలో కిడ్నీ బాధితుడు నాగ వెంకట చంద్రబాబు మొర విన్నారు. చంద్రబాబు సమస్య తెలుసుకొని గంటల వ్యవధిలో అతడికి సాయం అందజేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మంగళవారం ఉదయం బాధితుడు వెంకట చంద్రబాబుకు కలెక్టరేట్లో రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు.
కిడ్నీ బాధితుడు చంద్రబాబుకు చెక్కు పంపిణీలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానితో పాటు పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తన మొర విన్న గంటల వ్యవధిలోనే ప్రభుత్వం సాయం చేసినందుకు నాగ వెంకట చంద్రబాబు.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా.. బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా తొలుత తపసిపుడి గ్రామానికి చేరుకున్నారు జగన్. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారాయన. అనంతరం మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ పైలాన్‌ను జగన్ ఆవిష్కరించారు.
కిడ్నీ బాధితుడు చంద్రబాబుకు
సీఎం జగన్ ఆర్ధిక సాయం.. pic.twitter.com/DOlxFVrN4s— Rahul (@2024YCP) May 23, 2023