రైతన్నలను ఆదుకునే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మహోన్నత కార్యక్రమం వైఎస్సార్ రైతు భరోసా. ఈ పథకం ద్వారా.. ఏటా రైతులకు మూడు విడతల్లో.. 13,500 రూపాయల సాయాన్ని అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తున్నారు. ఈ క్రమంలో నాలుగో ఏడాది రెండో విడత రైతు భరోసా నిధులను సోమవారం విడుదల చేశారు సీఎం జగన్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం జగన్. బటన్ నొక్కొ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 లక్షల మందికి పైగా అర్హులైన రైతన్నల ఖాతాలో 4 వేల రూపాయలు జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నదాతలకు ఆర్థిక సాయం అందచేసి.. తోడుగా ఉంటున్నాం. భరోసా నిధులు పొండంలో ఎక్కడా వివక్ష లేదు.. లంచాల ప్రసక్తే లేదు. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా 7,500 రూపాయలు విడుదల చేశాం. ఇప్పుడు మరో నాలుగు వేల రూపాయలు విడుదల చేశాము. గడిచిన మూడున్నరేళ్లలో రైతు భరోసా కింద రైతులకు 25,971 కోట్ల రూపాయల మేర లబ్ధి కలిగింది. ఈ మూడేళ్లలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించే అవసరం రాలేదు. అదే చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరం కరువే. బాబు, కరువు కవల పిల్లలు అన్నట్లు పాలన సాగింది’’ అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు.
వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా కేవలం రైతులకు మాత్రమే కాక అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు కూడా ప్రభుత్వం ఏటా రూ.13,500 ఆర్థికసాయం అందిస్తోంది. ఇక ఇప్పటి వరకు ఈ పథకం కింద 24,61,000 మంది బీసీ లబ్ధిదారులకు రూ.12,113.11 కోట్ల ఆర్థిక సహాయం అందగా, 5,23,000 మంది ఎస్సీ లబ్ధిదారులకు రూ.2,653.04 కోట్లు.. 3,92,000 మంది ఎస్టీలకు రూ. 1,30,771 మైనారిటీలకు రూ.60,30,771 ఆర్థిక సాయం అందింది. 7,85,700 మంది కాపు లబ్ధిదారులకు రూ.3,793.44 కోట్లు, ఇతర వర్గాలకు చెందిన 10,16,300 మంది లబ్ధిదారులకు రూ.5,319.93 కోట్లు భరోసా సాయం అందింది.