భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో భాగంగా శనివారం ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రధాని వెంట ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు. ఈ సభలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణలు కూడా ఉన్నారు. ఈ వేదికపై నుంచి ప్రధాని 5 ప్రాజెక్టులకు శంకుస్థాపన,2 ప్రాజెక్టులకు జాతికి అకింత చేస్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాలను ఈ సభలో సీఎం జగన్ ప్రస్తావించారు. వీటిని నిరవేర్చాలని ప్రధాని మోదీకి సీఎం విన్నవించారు. ఈ సభలో సీఎం చాలా తక్కువ సమయంలోనే రాష్ట్రానికి అవసరమైన అన్ని విషయాల గురించి స్పష్టంగా మోదీకి తెలియజేశారు.
ఈ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. “గౌరవనీయులు, పెద్దలు, ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. చారిత్రక ఆంధ్ర యూనివర్శిటీలో ఈరోజు ఒకవైపు సముద్రం, మరోవైపు జన సముద్రం కనిపిస్తున్నాయి. ఈ సభకు ఉత్తరాంధ్ర జనం ప్రభంజనంలా తరలివచ్చారు. రాష్ట్రంలో రూ. 10,742 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజలందరి తరపున, ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏపీకి మీరు పెద్ద మనసుతో ఎంతో చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా మీతో మాకు ఉన్న అనుబంధం ఎంతో బలమైనది.
కేంద్రంతో మాకు ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమైనది. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే జోన్ వంటి వాటి ప మేము పలుమార్లు చేసిన విన్నపాల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నాను. రాష్ట్రానికి మీరు చేసే ప్రతి సాయం, ఇచ్చే ప్రతి సంస్థ, ప్రతి రూపాయి మా అభివృద్ధికి దోహదపడతాయి” అని ప్రధాని సమక్షంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.