ఏపీలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగు చూసిన నకిలీ చలాన్లపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం నకిలీ చలాన్ల అంశంపై స్పందించారు. నకిలీ చలాన్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. రూ.40 లక్షలు రికవరీ చేసినట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఏసీబీ దాడులు చేస్తే తప్ప వ్యవహారం వెలుగులోకి రాలేదని సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు.
అక్రమాలకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఎంతకాలంగా ఈ తప్పులు జరుగుతున్నాయి. అసలు తప్పులు జరుగుతుంటే మీ దృష్టికి ఎందుకు రాలేదని సీఎం అదికారులను ప్రశ్నించారు. వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయో, లేదో ఎందుకు చూడట్లేదు అని సీఎం అధికారులను ప్రశ్నించారు. అవినీతిపై ఎవరికి కాల్ చేయాలో ప్రతి ఆఫీసులోనూ నంబర్ ఉంచాలి. క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం తెప్పించుకోవాలి. కాల్ సెంటర్‌కు వచ్చే కాల్స్పై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. అవినీతికి చోటు లేకుండా పూర్తిస్థాయిలో సాఫ్ట్‌పేర్‌లో మార్పులు చేశామని అధికారులు తెలిపారు. మీ-సేవల్లో పరిస్థితులపైనా పరిశీలన చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
అసలు నకిలీ చలాన్ల కుంభకోణం ఏంటో చూద్దాం. ఇప్పటివరకు 770 నకిలీ చలాన్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించామని రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ వెల్లడించారు. చలాన్ల కుంభకోణం ప్రభుత్వం చెబుతున్న దాని కంటే చాలా పెద్దగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సస్పెన్షన్‌కు గురైన సబ్ రిజిస్ట్రార్ల సంఖ్య ఆరుకు చేరిపోయింది. ఇతర సిబ్బందినీ పెద్దఎత్తున సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయంపైనా ఆరా తీశారు. ఇప్పటికే 65 లక్షల డాక్యుమెంట్లు పరిశీలించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ చలాన్ల కుంభకోణం ఎప్పట్నుంచి జరుగుతుందో గుర్తిస్తే తప్ప అసలు గోల్‌మాల్‌ను అంచనా వేయలేని నిపుణులు చెబుతున్నారు. మొత్తం వ్యవహారంపై పోలీసు విచారణ సరిపోతుందన్న ప్రభుత్వ వాదనను కొందరు తప్పుపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే గండి కొట్టే అతిపెద్ద కుంభకోణం కాబట్టి చర్యలు మరింత సీరియస్‌గా ఉండాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.