ప్రతి ఒక్కరి జీవితంలో చదువు ఎంతో ముఖ్యమని ఏపీ సీఎం జగన్ అన్నారు. చదువు వల్ల కుటుంబాల చరిత్రే మారిపోతుందని ఆయన చెప్పారు.
చదువు ఒక మనిషి జీవితాన్ని ఎంతగానో మారుస్తుందని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అన్నారు. కుటంబాలతో పాటు వారి సామాజిక వర్గాల చరిత్రను కూడా చదువు మారుస్తుందని అని ఆయన చెప్పారు. అనంతపురం జిల్లాలోని నార్పలలో ‘జగనన్న విద్యా దీవెన’ పథకం నిధులను స్టూడెంట్స్ అకౌంట్స్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ పైవ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. పేదరికం సంకెళ్లను తెంచే అస్త్రం కూడా చదువేనని స్పష్టం చేశారు. గత పాలనతో పోలిస్తే ఇప్పుడు పేదల బతుకుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయన్నారు జగన్.
వైసీపీ పాలనలో నాలుగేళ్ల కాలంలో విద్యా రంగంలో మంచి ఫలితాలను సాధించామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ రంగానికి సంబంధించి గత ప్రభుత్వం ఏకంగా రూ.1,778 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిపోయిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో విద్యా రంగంలో ఇప్పుడు డ్రాప్ ఔట్స్ గణనీయంగా తగ్గాయని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న వారు కాలేజీల్లో చేరేదాన్ని జీఈఆర్ రేషియో అంటారని.. ఆ రేషియో 2018-19 నాటికి 32.4 శాతం ఉండేదన్నారు. ఆ రేషియోను 70 నుంచి 80 శాతానికి చేరుకునేలా కృషి చేస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు.
తాము అధికారంలోకి రాకముందు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 37 లక్షలు అని.. ఈ రోజు ఆ సంఖ్య 40 లక్షలు దాటిందన్నారు జగన్. అన్న ఉన్నాడు బాగా చదివిస్తాడనే నమ్మకం సర్కారు బడుల్లో తమ పిల్లల్ని చేర్పిస్తున్న పేరెంట్స్‌కు ఉందన్నారు. ఒక్క సత్య నాదెళ్ల సరిపోడని.. రాష్ట్రంలోని పిల్లలంతా సత్య నాదెళ్లలు కావాలనేది తన ఉద్దేశమని జగన్ పేర్కొన్నారు. పిల్లలు సత్య నాదెళ్లతో పోటీపడే పరిస్థితులు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ క్రమంలో ‘జగనన్న విదేశీ దీవెన’ పేరుతో ఒక పథకం తీసుకొచ్చామన్నారు. టాప్-50 యూనివర్సిటీల్లో ఎవరికైనా సీటు వస్తే వారి చదువులకు అయ్యే రూ.1.25 కోట్ల వరకు ఫీజులు ప్రభుత్వమే భరిస్తుందని జగన్ వివరించారు.