సంక్షేమ పథకాల అమల్లో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. కేవలం బలహీన వర్గాల వారికి మాత్రమే కాక అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు ఆర్థిక సాయం చేయడం కోసం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. నేడు అందుకు సంబంధించిన నిధులు విడుదల చేశారు. ఆ వివరాలు..
సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నవరత్నాల పేరుతో.. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, రైతు భరోసా, వంటి పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం వెనకబడిన వర్గాల వారికి మాత్రమే కాక.. రెడ్డి, కాపు, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లమ్మలకు (ఈబీసీ) ఆర్థిక సాయం చేయడం కోసం వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న పేద మహిళలకు మూడేళ్లలో ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున రూ. 45 వేల ఆర్థిక సహకారాన్ని అందజేస్తారు.
నేడు అనగా ఏప్రిల్ 12న వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద.. 4,39, 068 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని జమ చేశారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురంలోభారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎస్‌వీకేసీ డిగ్రీ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకున్న సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత.. బటన్ నొక్కి మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు.
ఈ పథకానికి సంబంధించిన ఇప్పటికే అర్హులను గుర్తించిన ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించి ఫైనల్ జాబితాను విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయంలో లబ్ధిదారుల జాబితాను అందుబాటులో ఉంచింది. మొత్తం 4,39, 068 లబ్ధిదారులుగా గుర్తించింది ప్రభుత్వం. ఈ పథకం ప్రకటించిన తర్వాత.. మొత్తం 8,85,567 దరఖాస్తులు రాగా 8,70,239 దరఖాస్తులు మాత్రమే అప్డేట్ అయ్యాయి. 15,328 దరఖాస్తులు అప్డేట్ కాలేదు. 98.27 శాతం అప్డేట్ అయ్యింది. ఎవరైనా ఇంకా అప్డేట్ చేయించుకోలేని వారు ఉంటే వెంటనే మీ వివరాలు, ధ్రువీకరణ పత్రాలు సచివాలయంలో ఇచ్చి అప్డేట్ చేయించుకోవచ్చని అధికారులు సూచించారు. ఇప్పటి వరకు మొత్తం 4,39, 068 మందిని అర్హులుగా గుర్తించారు.