ఏపీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటించారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏర్పాటు చేసిన ఏపీ జెన్‌కో ప్రాజెక్టు మూడో యూనిట్ బటన్ నొక్కి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నేలటూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. ద్యుత్ ఉత్పత్తి అంశంలో నేడు మరో ముందడుగు పడిందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన జెన్‌కో మూడో యూనిట్ 800 మెగావాట్ల ప్లాంటు జెన్ కో ఉత్పాదకతలో కీలకంగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008 లో జెన్ కో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఈ థర్మల్ పవర్ స్టేషన్‌కు మన రాష్ట్ర తొలిదళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.3,200 కోట్లు కేటాయించి.. 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో దాదాపు 45 శాతం విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలే చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ రంగంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన తొలి థర్మల్ విద్యుత్ కేంద్రం అని సీఎం జగన్ అన్నారు. కృష్ణపట్నం పోర్టు పరిధిలోని మత్స్యకారులు, మత్స్యకారేతరుల స్వప్నాన్ని కలల సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన రైతులందరికీ కూడా నిండు మనస్సుతో శిరసు వంచి ప్రత్యేకంగా అభివాదం తెలియజేస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. భూములు ఇచ్చిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు తెలిపారు.