ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అమరావతిలో 50 వేల మంది పైచిలుకు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆ వివరాలు..
రాష్ట్రంలో పేదలందరికి సొంత ఇల్లు ఉండాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం. దాన్ని నిజం చేస్తూ.. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయిస్తోంది జగన్ ప్రభుత్వం. నవరత్నాలు-పేదలందిరికి ఇళ్లు అనే పథకం కింద ఈ పట్టాలను అందజేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే.. మహిళల పేరు మీదనే ఈ ఇళ్ల పట్టాలను ఇస్తున్నారు. దీనిలో భాగంగా నేడు అమరావతి పరిధిలో 50 వేల మందికి పైగా లబ్ధిదారులకు.. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు సీఎం జగన్. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం వెంకటాయపాలెంలో ఏర్పాటు చేసిన నవరత్నాలు-పేదలందిరకీ ఇళ్లు పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పట్టాలను అందించారు. ఈ ప్రాంతంలో 1402.58 ఎకరాల్లో ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి.. సుమారు 50,793 మందికి ఇంటి స్థలాలను అందించేలా ప్లాట్లు ఏర్పాటు చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ మాత్రమే కాక.. సీఆర్డీఏ ప్రాంతంలో నిర్మించిన 5024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం సుమారు 443.71 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ప్రభుత్వం.
సీఆర్డీఏ పరిధిలో ఏర్పాటు చేసిన 25 లేఅవుట్లలో గుంటూరు జిల్లాకు చెంది 23,762 మంది, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 27,031 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ప్రతి ప్లాట్‌కు సరిహద్దులు గుర్తిస్తూ.. సుమారు 80 వేల హద్దు రాళ్లు ఏర్పాటు చేశారు. వీటి మధ్య అంతర్గత రవాణా కోసం 95.16 కిలోమీటర్ల పరిధిలో గ్రావెల్ రోడ్లు వేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,43,000 మందికి టిడ్కో ఇళ్లను అందజేసింది ప్రభుత్వం. 300 చదరపు అడుగులు ఉండే ఈ ఇళ్లను అన్ని హక్కులతో కేవలం 1 రూపాయికే లబ్ధిదారులకు అందజేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మరి జగన్ సర్కార్ చేస్తోన్న ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.