ఇళ్లు లేని పేదలకు అమరావతిలో ఇంటి పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇళ్లు లేని వారికి అమరావతిలో ఇంటి పట్టాలు ఇస్తామని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ అధ్యక్షతన జరిగిన ముప్పై మూడో సీఆర్డీఏ అథారిటీ మీటింగ్‌లో ఇందుకు ఆమోదం తెలిపారు. న్యాయపరంగా ఉన్న చిక్కులు వీడాక పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నారు. ఇకపోతే, ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం పేరిట ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే దీనికి సంబంధించిన జీవో జారీ చేశారు. ఈ జీవో ప్రకారం 1,134 ఎకరాల భూమిని అమరావతిలో పేదల ఇళ్ల కోసం కేటాయించారు. మొత్తం 20 లేఔట్లలో స్థలాలు ఇస్తామంటూ చెప్పారు.
ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కూరగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో.. పేదలందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. నవరత్నాలు పథకం ద్వారా లబ్ధిదారులకు ఇళ్లపట్టాలను ఏపీ సర్కారు ఇవ్వనుంది. లబ్ధిదారుల లిస్టుతో డీపీఆర్‌లు రూపొందించాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ ప్రతిపాదనలను సీఆర్డీఏకు అప్పగించాలని కూడా నిర్ణయించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడో విడత కింద ఇళ్లు లేని వారికి ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా తగిన కార్యాచరణ తయారు చేసుకోవాలని ఆఫీసర్స్‌కు ఆయన సూచించారు. మే నెల మొదటివారంలోగా పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.