అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాయదుర్గం దగ్గర బొమ్మనహల్ మండలం దర్గాహొన్నూరు గ్రామంలో ఓ రైతుకి చెందిన పొలంలో మొక్కజొన్న కంకులు కోయడం కోసమని మహిళా కూలీలు వెళ్లారు. కోసిన కంకులను ట్రాక్టర్ లో లోడ్ చేస్తున్న సమయంలో 33కేవీ విద్యుత్ లైన్ తెగి ట్రాక్టర్ పై పడింది. దీంతో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని బళ్లారి ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి స్పందించారు. విద్యుత్ తీగ తెగి నలుగురు మహిళలు మృతి చెందడం, ముగ్గురికి గాయాలు అవ్వడం బాధాకరమైన సంఘటన అని అన్నారు.
ఈ సంఘటన తీవ్ర దిగ్భాంతికి గురి చేసిందని అన్నారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. సీఎం జగన్ కూడా ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సీఎం జగన్ ఆదేశించడం జరిగిందని వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కాపు రామచంద్రారెడ్డి వెల్లడించారు.
#బొమ్మనహాల్_ఘటన_బాధాకరం#బాధితులకు_అండగా_ఉంటాం pic.twitter.com/IdbmUqkFuI
— Kapu Ramachandra Reddy (@kapuramachandra) November 2, 2022