ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన, దేశానికే తలమానికంగా ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న వరుస ఆత్మహత్యల దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుల్, ఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే షార్ కేంద్రంలో మరో ఆత్మహత్య వెలుగు చూసింది. ఆత్మహత్య చేసుకున్న వికాస్ సింగ్ భార్య ప్రియాసింగ్ నర్మద అతిథిగృహంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సీఐఎస్ఎఫ్ ఎస్‌ఐ వికాస్ సింగ్ ఆత్మహత్య గురించి ఉత్తరప్రదేశ్ లో ఉంటున్న కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం అందించారు. వికాస్ సింగ్ సతీమణి తన అన్న, పిల్లలతో కలిసి శ్రీహరికోటకు చేరుకున్నారు. తన భర్త మృతదేహం వద్ద ప్రియాసింగ్ గుండెలవిసేలా ఏడ్చారు. మంగళవారం వారు అతిథిగృహంలోనే బస చేశారు. భర్త ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు నర్మదను విచారించారు. బుధవారం తెల్లవారుజామున నర్మద అతిథిగృహంలో ప్రియాసింగ్(27) ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బంధువులు సీఐఎస్ఎఫ్ అధికారులకు సమాచారం అందించారు.
వికాస్ సింగ్, ప్రియా సింగ్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ఆస్పత్రికి తరలించారు. భర్త మరణం తట్టుకోలేకే ప్రియాసింగ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. వీరిద్దరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు ఫస్ట్ క్లాస్, ఒక కుమార్తె ఎల్‌కేజీ చదువుతోంది. ఇంకో కుమార్తె చిన్నపాప అని చెబుతున్నారు. వారిలో ఒక కుమార్తె వికలాంగురాలని తెలుస్తోంది. గతంలో వికాస్ సింగ్ ముంబై విధులు నిర్వహించాడు. అక్కడ అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కానీ, షార్ లో ఇలా ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడుతున్నారనే దానిపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.
నిజానికి షార్ లో ఆత్మహత్యలు జరగడం కొత్తేం కాదు. గతంలో కూడా ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే స్పేస్ సెంటర్‌లో పెద్దగా పని ఒత్తిడి కూడా ఉండదని చెబుతున్నారు. అక్కడ ప్రయోగం, వీఐపీలు వచ్చిన సమయంలోనే భద్రత ఏర్పాట్లు చూసుకోవాలని.. మిగిలిన సమయంలో అంత హడావుడి ఉండదని చెబుతుంటారు. ఇక్కడ మొత్తం 947 మంది వరకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలకు చెందిన వారు ఉన్నారు. వారిలో 90 మంది మహిళలు. అయితే ఇక్కడ ప్రతి మూడేళ్లకొకసారి బదిలీలు ఉంటాయి. కరోనా వల్ల మధ్యలో రెండేళ్లపాటు బదిలీలు జరగలేదు. గతేడాది అక్టోబర్ నెలలో 500 మంది బదిలీలపై వెళ్లగా వారి స్థానంలో కొత్తవాళ్లు వచ్చారు. కుటుంబాలకు దూరంగా ఉండటం వల్లే చాలా మంది మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారని భావిస్తున్నారు.