ఏపీలో సినిమా టికెట్స్ వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలలో తప్పుఒప్పులు సహజంగా ఉంటూనే ఉంటాయి. ఆ జీవోలు అమల్లోకి వచ్చాక, వాటిలోని లోటుపాట్లును నాయకులకు వివరించాల్సిన బాధ్యత, అవసరం ఆయా రంగాలపై ఆధారపడి జీవించే వారికి ఉంటుంది. కానీ.., సినిమా టికెట్ల రేట్ల విషయంలో సినీ పెద్దలు ఈ దిశగా ప్రయత్నాలు చేయలేదు. భావోద్వేగాలని కంట్రోల్ చేసుకోలేకపోయారో, తమకి నచ్చని ప్రభుత్వ పెత్తనాన్ని సహించలేకపోయారో తెలియదు గాని మొదటిరోజు నుండే ప్రభుత్వాన్ని ఢీ కొట్టడం మొదలు పెట్టారు. కిరాణా కొట్టు కామెంట్స్ దగ్గర మొదలు పెట్టి.., ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పవర్స్ నిర్ణయించే స్థాయికి వచ్చేశారు. ఇవన్నీ సరిపోవన్నట్టు ఇప్పుడు కొత్తగా రంగంలోకి రామ్ గోపాల్ వర్మ వచ్చి చేరారు.
రామ్ గోపాల్ వర్మ తన పదునైన మాటలతో మంత్రి పేర్ని నానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మరికొంతమంది మంత్రులు ఎవరో తనకి తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇవన్నీ పక్కన పెడితే.. టికెట్స్ రేట్లని నిర్ణయంచడానికి ప్రభుత్వానికి ఏమి అధికారం ఉందన్నది వర్మ ప్రశ్న. పైగా.. దీనికి డిమాండ్ అండ్ సప్లై పాలసీ, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, ఎకనామిక్ రిఫార్మ్స్ వంటి పెద్ద పెద్ద పదజాలాన్ని వాడేశారు. సరే ఇన్ని విషయాలు తెలిసిన రామ్ గోపాల్ వర్మకి ప్రభుత్వ పరిధులు ఎంత వరకు ఉంటాయన్న విషయం తెలియదంటారా?
ఇది కూడా చదవండి : సినిమా టిక్కెట్ ధరలతో నాకేం ఇబ్బంది లేదు.. నాగార్జున సంచలన వ్యాఖ్యలు
అమ్మేవాడి నమ్మకం ఎక్కువై, కొనేవాడి అవసరం ఎక్కువై.. వస్తు ధర సామాన్యుడి ఆర్థిక శక్తిని దాటిపోతుంటే ప్రభుత్వాలు ఆ ధరలను క్రమబద్దీకరించకూడదు అంటే ఎలా? సరే.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అంత అత్యవసర పరిస్థితి లేదు అన్న రామ్ గోపాల్ వర్మ మాటలనే కాసేపు నమ్ముదాము. మరి.. గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చే సీనియర్ యన్టీఆర్ సినిమా టికెట్స్ రేట్లను తగ్గించారా? స్లాబ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారా? ఒక్క సినిమా టికెట్స్ విషయంలోనే కాదు.., అప్పట్లో అన్నగారు హోటల్స్ లో టిఫిన్ రేట్లను నిర్ణయించిన రోజులు రామ్ గోపాల్ వర్మ మర్చిపోయారా? లేక చరిత్ర మర్చిపోయింది అని బ్రమ పడ్డారా?
ఆ రోజు ఆయా రంగాల్లో వర్మగారు చెప్పిన అత్యవసర పరిస్థితిలు ఏర్పడితేనే సీనియర్ యన్టీఆర్ ఈ నిర్ణయాలు తీసుకున్నారా? మరి.. అప్పుడు యన్టీఆర్ మీద లేవని నోర్లు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పైన ఎందుకు లేస్తున్నట్టు? ఆరోజు దాసరి అధ్యక్షతన పరిశ్రమ మొత్తం యన్టీఆర్ ని కలసి తమ బాధని చెప్పుకున్నాయి కదా? మరి.. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు అంతా కలసి సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు కలవలేకపోతున్నారు? నిజానికి ఒక్క సీనియర్ యన్టీఆర్ మాత్రమే కాదు.. తరువాత వచ్చిన చంద్రబాబునాయుడు, రాజశేఖర్ రెడ్డి, వీరంతా కూడా సినిమా టికెట్స్ రేట్లని ఏదో ఒక విధంగా క్రమబద్దీకరించిన ముఖ్యమంత్రులే. కానీ.., అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి? ఇప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రులను నేరుగా ప్రశ్నించే దైర్యం వీరు ఎందుకు చేయగలుగుతున్నారు? అసలు సమస్యకి పరిష్కారం రాకపోవడానికి ఇదే ప్రధాన కారణమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : టాలీవుడ్ కి గడ్డు కాలం.. దుకాణం సర్దేయాల్సిందేనా!
ఏపీలో ఇప్పుడున్న సినిమా టికెట్స్ రేట్ల ప్రకారమైతే.. పెద్ద సినిమాల మనుగడ అసాధ్యం. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. కానీ.., తెలంగాణలోలా టికెట్ ధరని రూ.350 అమ్ముకుంటాం అంటే దానికి ఏపీ ప్రభుత్వం ఒప్పుకోదు. మధ్యే మార్గాన ధరల నిర్ణయం అయితే జరగాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలి అంటే.. పరిశ్రమ పెద్దలు అంతా ఒకేతాటిపైకి వచ్చి ప్రభుత్వ పెద్దలను కలవాల్సి ఉంటుంది. కానీ.., మన సినీ పెద్దల మధ్య ఆ ఒద్దిక ఉందా? మరి..రాష్ట్ర ఆర్థిక నిపుణులతో సైతం చర్చించడానికి సిద్ధమని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ ఈ విషయంలో సినీ పెద్దలు అందరిని ఒక తాటి మీదకి తీసుకునిరాగలరా? వారందరిని ప్రభుత్వ పెద్దల ముందుకి నిలబెట్టగలరా? ఇదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం వస్తే.. అన్నీ సమస్యలకి పరిష్కారం దొరికినట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.