తల్లి అంటే బిడ్డలకు ఏ కష్టం రాకుండా చూసుకుటుంది.. తనే బిడ్డకు రక్షణ కవచంగా నిలుస్తుంది అంటారు. అయితే అందరు తల్లులు అలానే ఉండరు. కొందరు మాతృమూర్తులు.. పిల్లల భవిష్యత్తు నాశనమైనా.. వారి జీవితాలు పాడైనా సరే.. తమ మాటే నెగ్గాలనుకుంటారు. బిడ్డలను మంచి మార్గంలో నడపాల్సింది పోయి.. వారే దగ్గరుండి.. బిడ్డల జీవితాలను నాశనం చేస్తారు. పిల్లలు ఎంత కష్టంలో ఉన్న వారిని పట్టించుకోరు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఏపీ, చిత్తూరులో చోటు చేసుకుంది. ‘ఇష్టంలేని పెళ్లి చేశారు.. అందుకే నేను నా భర్త వద్దకు వెళ్లలేదు.. దీంతో మా అమ్మ నా బిడ్డను లాక్కొని నన్ను కొట్టి ఇంటి నుంచి తరిమేసింది.. నా బిడ్డ నాకు కావాలి’ అని ఓ బాలింత బుధవారం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వివరాలు..
బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా పేరు అశ్విని(20). మాది పెద్దపంజాణి మండలం, నిడిగుంట గ్రామం. ఏడాదిన్నర క్రితం నన్ను వి.కోటకు చెందిన కోదండ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. నాకు 11 నెలల పండు అనే మగబిడ్డ ఉన్నాడు. ప్రసవం కోసం పుట్టింటికి వచ్చాను. నా తల్లి ఇప్పుడు భర్త దగ్గరకు వెళ్లాలని బలవంతం చేస్తోంది. ఇందుకు నేను ఒప్పుకోకపోవడంతో శనివారం నా బిడ్డను లాక్కొని నన్ను కొట్టి ఇంట్లో నుంచి పంపించేసింది. రెండు రోజులుగా పలమనేరు బస్టాండులో ఉన్నాను. ఓ మహిళ సాయంతో చిత్తూరు చేరుకున్నాను. నా భర్త నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అందుకే అతడి దగ్గరకు వెళ్లాలని అనుకోవడం లేదు. నాకు నా బిడ్డ కావాలి.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటాను’’ అంటూ ఆవేదన వ్యక్తి చేసింది. ఈ మూడు రోజులుగా బిడ్డకు పాలు పట్టకపోవడంతో తన ఆరోగ్యం దెబ్బతినిందని వాపోయింది. బిడ్డను ఇప్పిస్తే చాలని, తన బతుకేదో.. బతుకుతానని పేర్కొంది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.